రాష్ట్ర హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:12 AM
రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ (సీజే)గా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తి
పేరును సిఫారసు చేసిన కొలీజియం
ఢిల్లీ హైకోర్టు సీజేగా తెలంగాణ హైకోర్టు
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శాంకోషీ
నలుగురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ (సీజే)గా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సోమవారం జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (యాక్టింగ్ సీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ శాంకోషీని ఢిల్లీ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మానశ్ రంజన్ పాఠక్‌ను అదే హైకోర్టు సీజేగా, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌సింగ్‌ను ఉత్తారఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని తీర్మానించింది.
మొత్తంగా నలుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసులు చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వీరు పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ ఈ నెల మొదట్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. దీంతో హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ శాంకోషి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కొలీజియం తాజా సిఫారసుతో త్వరలో పూర్తిస్థాయి సీజే రానున్నారు.
న్యాయవాదుల కుటుంబంలో జననం
జస్టిస్ తపబ్రత చక్రవర్తి 1967లో కోల్‌కతాలో న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేసిన తర్వాత 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. రాజ్యాంగ సంబంధిత, సివిల్ కేసుల్లో విస్తృతంగా ప్రాక్టీస్ చేశారు. 2013 అక్టోబరు 30వ తేదీన కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా, 2016 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సుజోయ్‌పాల్ పదవీ విరమణ అనంతరం కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది సెప్టెంబరు 7వ తేదీ వరకు బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్‌లో జస్టిస్ తపబ్రత చక్రవర్తి సభ్యుడిగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News