జనసేనతో పొత్తు వద్దే వద్దు!
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:15 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు అంశంపై కమలనాథులు అంతర్గతంగా కీలక చర్చ జరిపారా? ఈ అంశంపై బీజేపీ ముఖ్య నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారా? మెజారిటీ నేతలు పొత్తును వ్యతిరేకించారా? ..
బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ ముఖ్యుల వినతి
కీలక సమావేశంలో పొత్తుపై చర్చ
బీజేపీ ఆశావహుల తుది జాబితాలో జనసేన అభ్యర్థి గడల పేరు?
హైదరాబాద్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు అంశంపై కమలనాథులు అంతర్గతంగా కీలక చర్చ జరిపారా? ఈ అంశంపై బీజేపీ ముఖ్య నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారా? మెజారిటీ నేతలు పొత్తును వ్యతిరేకించారా? బీజేపీ ఎమ్మెల్సీ ఆశావహుల తుది జాబితాలో జనసేన అభ్యర్థి పేరు ఉందా?.. అంటే అవుననే అంటున్నాయి బీజేపీ విశ్వసనీయ వర్గాలు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జులు రేఖాశర్మ, అభయ్‌పాటిల్‌లు రాష్ట్ర పార్టీ ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో జనసేనతో పొత్తుపై చర్చించారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును జనసేన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో పొత్తు అంశంపై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను జనసేన బాధ్యులు తమ ముందు ఉంచారని బీజేపీ ముఖ్యనేత ఒకరు బన్సల్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో బన్సల్ మిగతా పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. ‘జనసేన పట్ల తెలంగాణలో వ్యతిరేకత ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు అంటే ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసి ప్రచారం చేసే ప్రమాదం ఉంది. సున్నితమైన ఈ అంశంపై అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. హిందూత్వకు బీజేపీ బ్రాండ్‌గా ఉంది. పవన్ కల్యాణ్ వచ్చి ఇక్కడ హిందుత్వం గురించి ప్రచారం చేస్తే పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి? అన్న అంశాన్ని కూడా గుర్తించాలి’ అని మెజారిటీ నేతలు బన్సల్‌కు వివరించారు.
‘పొరుగు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న దృష్ట్యా ఇక్కడ జనసేనను గౌరవిద్దాం. ఇక్కడ పరోక్షంగా వారి మద్దతు తీసుకుందాం.. అంతేగానీ పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుంది..’ అని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. కాగా, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో జనసేనకు మద్దతు ఇస్తే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మరోనేత తెలిపారు. ఒకవేళ గడల జనసేన నుంచి బీజేపీలోకి వస్తే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. మొత్తమ్మీద పొత్తుపై జాతీయ నాయకత్వానికే వదలిపెట్టాలని సమావేశం నిర్ణయించిందని మరో ముఖ్యనేత వెల్లడించారు.
కాగా, ఎమ్మెల్సీ టికెట్ ఆశావహుల తుది జాబితాను రాష్ట్ర పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు తెలిపాయి. అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే తప్ప ఆయనే అభ్యర్థిగా ఉంటారని పేర్కొన్నాయి. ఈ స్థానానికి పార్టీ సీనియర్ నేతలు పవన్‌కుమార్ రెడ్డి, గౌతంరావు, ఓఎస్ రెడ్డిల పేర్లు కూడా ప్రతిపాదించారు. మరోవైపు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుంచి భిక్షంగౌడ్, వెంకటరమణ, రవికుమార్‌లతో పాటు జనసేన అభ్యర్థిగా పోటీచేస్తున్న గడల శ్రీనివాసరావు పేరు కూడా జోడించినట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు
దివ్యాంగులు, మహిళల పెండింగ్ బిల్లులు.. రూ.16లక్షలు చెల్లించాలి: హరీశ్‌రావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News