Share News

సింగరేణిని కాపాడుకోవాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:10 AM

సింగరేణి కాలరీస్‌ సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సంస్థ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.

సింగరేణిని కాపాడుకోవాలి
Bhatti Vikramarka

  • సంస్థ బలోపేతానికి సమగ్ర ప్రణాళిక..

  • ఉత్పత్తి వ్యయం తగ్గ్గించి.. ఉత్పత్తి పెంచాలి

  • ఇతర కీలక ఖనిజాల రంగంలోకి విస్తరించాలి

  • సింగరేణిని దెబ్బతీసినవారే నేడు విమర్శిస్తున్నారు

  • సింగరేణి జనరల్‌ మేనేజర్ల సమావేశంలో

  • డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌/సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్‌ సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సంస్థ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గ్గించడం, ఉత్పాదకత పెంచడం, కొత్త గనులను అభివృద్ధి చేయడంతోపాటు కీలక ఖనిజాల అన్వేషణలోకి విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సింగరేణికి చెందిన 66 మంది జనరల్‌ మేనేజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల అభివృద్ధి, భవిష్యత్తు విస్తరణ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.


ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పదేళ్లపాటు సింగరేణి విస్తరణను పట్టించుకోకుండా, కొత్త బొగ్గు బ్లాకులు అందకుండా చేసి సంస్థను నిర్వీర్యం చేయాలని చూసిన గత పాలకులు.. ఇప్పుడు సంస్థ కు నష్టం జరుగుతోందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణిని కాపాడేందుకు తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, కొత్త గనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 36వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆధారపడిన సింగరేణిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.


సింగరేణి బొగ్గు సరఫరా చేయలేకపోతోందంటూ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అవసరమైన బొగ్గు కేటాయింపులు లేకుండానే విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా బాధ్యతలను సింగరేణిపై పెట్టడం వల్ల సమస్యలు తలెత్తాయని వివరించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటే మార్కెట్‌లో ఇతర సరఫరాదారులతో పోటీ పడటం కష్టమని హెచ్చరించారు. అదే జరిగితే సంస్థ మార్కెట్‌ను కోల్పోవడమే కాకుండా, ఉద్యోగు ల భవిష్యత్తుపైనా ప్రభావం పడుతుందని అన్నారు. భవిష్యత్తులో బొగ్గుపై మాత్రమే ఆధారపడకుండా సంస్థ రాగి, బంగారం, లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లోకి ప్రవేశించాలని ఆయన సూచించారు.


కొరియా పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలు

దక్షిణ కొరియా సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, లైఫ్‌ సైన్సెస్‌ తదితర రంగాల్లో కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘కొరియా కల్చర్‌ డే 2026 కె హార్మనీ ఫెస్టా’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనదేశంలో దక్షిణకొరియా రాయబారి లీ సియోంగ్‌ హో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పరిశ్రమలతో పాటు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్ట్‌పలు, చిన్న పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపారు. కొరియా సంస్కృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుక రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. లీ సియోంగ్‌ హో మాట్లాడుతూ.. దేశ రాజధానికి ఆవల కొరియా సంస్కృతిని పరిచయం చేయడానికి రూపొందించిన ఒక ప్రాంతీయ పర్యటన ఉత్సవం కె హార్మనీ ఫెస్టా అని తెలిపారు. భారతీయ దీపాల పండుగ దీపావళి, కొరియన్‌ చూసోక్‌ పండుగతో ముడిపడి ఉన్న పౌర్ణమి సంప్రదాయాల నుంచి ఇది ప్రేరణ పొందిందని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

రేవంత్‌ పాలనలో వరుస స్కామ్‌లు

దివ్యాంగులు, మహిళల పెండింగ్‌ బిల్లులు.. రూ.16లక్షలు చెల్లించాలి: హరీశ్‌రావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:10 AM