రేవంత్ పాలనలో వరుస స్కామ్‌లు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:56 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ప్రశ్నిస్తే తిట్లు, అక్రమ కేసులతో బెదిరింపులు
తమకు ముట్టే సొమ్ము కోసమే రాహుల్‌గాంధీ మౌనం
మోదీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం, ఆయన సోదరుల అవినీతిని ప్రశ్నిస్తే.. తిట్లు, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం మైనారిటీ నాయకుడు జిబ్రాన్ షరీఫ్, మరికొందరు ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ హయాంలో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలపై పలుప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.
దీనిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని.. తమకు ముట్టే సొమ్ము కోసమే తెలంగాణలో కుంభకోణాలు, అక్రమాలపై రాహుల్ మౌనంవహిస్తున్నారని ఆరోపించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని... ప్రజలపై జులుం చేసేవారిని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దేశంలో మతతత్వ రాజకీయాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ ఒక్కటే సరిపోదని, ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముందు కేటీఆర్ నివాసంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత భార్గవ్ దేశ్‌పాండే బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలో ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదని.. టీడీపీ, ఆర్‌ఎస్ఎస్, బీజేపీ భావజాలమున్న కాంగ్రెస్ అని భార్గవ్ దేశ్‌పాండే విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేటీఆర్.. నీ దొంగ ఏడుపులు చాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News