Share News

చిన్నారి పెళ్లికూతురు కోసం..

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:42 AM

మైనారిటీ తీరని బాలికను పెళ్లి చేసుకోవడానికి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక షేక్‌.. అంగన్వాడీ టీచర్‌ అప్రమత్తతతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

చిన్నారి పెళ్లికూతురు కోసం..
Minor girl marriage case

  • 17ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సౌదీ నుంచి వచ్చిన అరబ్‌షేక్‌

  • పోలీసులకు సమాచారమిచ్చిన అంగన్‌వాడీ టీచర్‌

  • బాల్యవివాహాన్ని అడ్డుకుని బాలికను రక్షించిన పోలీసులు

  • రాజేంద్రనగర్‌ జోన్‌లో ఘటన

  • పోలీసులకు 50 లక్షలు లంచమిచ్చిషేక్‌ సౌదీకి పారిపోయినట్టుగా ఆరోపణ

  • ఆలస్యంగా వెలుగులోకి..

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మైనారిటీ తీరని బాలికను పెళ్లి చేసుకోవడానికి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక షేక్‌.. అంగన్వాడీ టీచర్‌ అప్రమత్తతతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే.. అతడు కోటీశ్వరుడు కావడంతో పోలీసులకు భారీగా లంచమిచ్చి కేసు నుంచి తప్పించుకుని తన దేశానికి పారిపోయినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్‌ జోన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సిటీ కమిషనరేట్‌ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. కొంతమంది దళారులు డబ్బు కక్కుర్తితో నగరంలోని పలు ప్రాంతాల బాలికలకు అరబ్‌, దుబాయ్‌ షేక్‌లతో గుట్టుగా పెళ్లి జరిపిస్తున్నారు. షేక్‌లు భారీగా ఇచ్చే డబ్బులో కొంత మేర బాలికల తల్లిదండ్రులకు కొంత డబ్బు ముట్టజెప్పి.. మిగతాదంతా (రూ.లక్షల్లో) తమ జేబులో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 2న.. సౌదీ నుంచి 42 ఏళ్ల అరబ్‌షేక్‌ నగరానికి వచ్చాడు.


రాజేంద్రగర్‌ జోన్‌ పరిధిలో ఓ ప్రాంతంలో దళారుల సహకారంతో 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు సైతం ఒప్పుకొని.. అర్ధరాత్రి వేళ పెళ్లి జరిపించడానికి అన్నీ సిద్ధం చేశారు. ఈ వ్యవహారం గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న ఒక అంగన్‌వాడీ టీచర్‌.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులను, దళారులను, అరబ్‌ షేక్‌ను స్టేషన్‌కు తరలించారు. అంగన్వాడీ టీచర్‌ ఫిర్యాదు మేరకు అక్టోబరు3న (అర్ధరాత్రి 12.15 గంటలకు) కేసు నమోదు చేశారు.


ఫ్లైటెక్కి చెక్కేసి..

బాల్యవివాహం కావడం, పైగా సౌదీ నుంచి వచ్చి నిఖా పేరుతో బాలికను అక్రమ రవాణా చేస్తున్నట్లు కేసు నమోదయ్యే అవకాశం ఉండటంతో.. నిందితుడు (అరబ్‌ షేక్‌) అప్రమత్తం అయ్యాడు. అతణ్ని వదిలిపెట్టడానికి పోలీసులు కోటి రూపాయల వరకు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. బేరసారాల అనంతరం మరుసటి రోజు ఉదయం అతడు వారికి కొంత డబ్బు ముట్టజెప్పి, నోటీసు తీసుకొని ఉన్నపళంగా ఫ్లైట్‌ ఎక్కి సౌదీకి చెక్కేసినట్లు తెలుస్తోంది. అతణ్ని వదిలేయడంలో సుమారు రూ.అరకోటి వరకూ డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన 20 రోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. బాల్య వివాహాన్ని అడ్డుకొని, బాలికను రక్షించి సఖి సెంటర్‌కు తరలించిన పోలీసులు.. ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా, ఎలాంటి మీడియా ప్రకటనా విడుదల చేయకుండా రహస్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎల్‌నినోతో కఠినమైన కరువు

మూతబడ్డా మాయ చేస్తున్నరు!

చక్కదనంపై లుక్కేయని చుక్క

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:42 AM