Share News

మూతబడ్డా మాయ చేస్తున్నరు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:13 AM

అడవి బిడ్డల బతుకులను బాగు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అధికారులు మాయ చేస్తున్నారు. గిరిజనుల ఉపాధిని గాలికొదిలేసి, ప్రైవేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడమే కాక.. సీఎంవోకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు.

మూతబడ్డా మాయ చేస్తున్నరు!
GCC Telangana

  • గిరిజన సహకార సంస్థ అధికారుల మాయాజాలం

  • జేఎల్‌జీ యూనిట్లు మూతబడినా నడుస్తున్నాయంటూ నివేదికలు

  • సీఎంవోను తప్పుదోవ పట్టిస్తున్న వైనం

  • ఆదిలాబాద్‌ జిల్లా, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పలు పరిశ్రమల మూత

  • ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డల బతుకులను బాగు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అధికారులు మాయ చేస్తున్నారు. గిరిజనుల ఉపాధిని గాలికొదిలేసి, ప్రైవేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడమే కాక.. సీఎంవోకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. గిరిజనులు నిర్వహిస్తున్న కొన్ని పరిశ్రమలు మూతబడ్డా.. అన్నీ సజావుగా పని చేస్తున్నాయంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ‘అడవి బిడ్డలకు అన్యాయం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనంపై జీసీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదివారం స్పందించారు. జీసీసీ స్థాపించిన మిర్చి, పసుపు, తేనె ప్రాసెసింగ్‌ యూనిట్లు, సబ్బుల తయారీ యూనిట్లతో సహా అన్ని ప్రాసెసింగ్‌ యూనిట్లు పని చేస్తున్నాయని చెప్పారు.


జేఎల్‌జీ( గిరిజన మహిళల జాయింట్‌ లయబిలిటీ గ్రూపు) యూనిట్లు ఒక్కటి కూడా మూతబడలేదని తెలిపారు. గిరి బ్రాండ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ పరిధిని విస్తరించే లక్ష్యంతో ఈ-టెండర్‌ ద్వారా ప్రధాన బ్రాండ్‌ ఫ్రాంచైజీని ఎంపిక చేశామన్నారు. ఉత్పత్తుల అభివృద్ది, ప్యాకేజింగ్‌, ప్రచారం, మార్కెటింగ్‌కు సంబంధించిన నిర్ధిష్ట కార్యకలాపాలను మాత్రమే ఫ్రాంచైజీకి అప్పగించామని వివరించారు. గిరి బ్రాండ్‌ ఉత్పత్తులను అధీకృత ఫ్రాంచైజీ, గిరిజన మహిళల జేఎల్‌జీ నుంచి సేకరించిన గిరిజన సంక్షేమ సంస్థలకు సరఫరా చేసే క్రమంలో జీసీసీకి 20శాతం మార్జిన్‌ లభిస్తుందన్నారు. ఇతర సంస్థలకు చేసే సరఫరాలపై 1శాతం రాయల్టీ వర్తిస్తుందని వెల్లడించారు. అయితే, ఈ వివరణకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడం గమనార్హం.


ఇవిగో నిజాలు..

జేఎల్‌జీ యూనిట్లలో ఏ ఒక్కటీ మూతబడలేదని అధికారులు చెబుతున్నారు. కానీ, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ‘ఆంధ్రజ్యోతి’ చేసిన పరిశీలనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ట్రైకార్‌, ఐటీడీఏ ఆర్థిక సహాయంతో 10 మంది ఆదివాసీ జేఎల్‌జీ మహిళా సభ్యులు ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన ‘కుమ్రుం బీమ్‌ పీనట్‌ చిక్కీ యూనిట్‌’ ప్రస్తుతం మూతబడింది. కేసీఆర్‌ కిట్లు, ఆశ్రమ పాఠశాలలకు పల్లీ పట్టీలు సరఫరా చేస్తూ జీవనం సాగించిన ఆ ఆదివాసీ కుటుంబాలు నేడు మళ్లీ కూలి పనులకు వెళుతున్నాయి. ఈ యూనిట్‌ సభ్యులు అటధికారుల సూచన మేరకు జూలైలో తయారు చేసిన 20 క్వింటాళ్ల పల్లీపట్టీలు అలాగే పేరుకపోయాయి.


పల్లీ పట్టీ ప్రైవేటువాళ్ల నుంచి కొంటున్నామని, మీ పల్లీపట్టీలు తీసుకోవద్దని పైనుంచి ఒత్తిడి ఉందని చెప్పి.. తమ సరుకును అలానే వదిలేశారని అక్కడి జేఎల్‌జీ అధ్యక్షురాలు కుర్సెంగ సంగీత వాపోయారు. సబ్బులు, షాంపూలు, శానిటరీన్యాప్కిన్ల తయారీ యూనిట్లతోపాటు ఆసిఫాబాద్‌లోని బిస్కెట్‌ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. గిరి బ్రాండ్‌ వస్తువులను కాదని అధికారులు ప్రైవేట్‌ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల తాము మళ్లీ కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాగోబా శానిటరీ ఇండస్ర్టీ అధ్యక్షురాలు కరుణశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ఐటీడీఏ పరిధి ఇల్లందులో రోజుకు 10 క్వింటాళ్ల కారం, 5క్వింటాళ్ల పసుపు తయారు చేసే జీసీసీ యూనిట్లు ఆర్డర్లు లేక మూతపడ్డాయి. ఓ ఆంధ్రా కాంట్రాక్టర్‌ కారం, పసుపులను విద్యా సంస్థలకు సరఫరా చేస్తున్నారు.


ప్రైవేటుకిచ్చి.. టెండర్‌ పెట్టామని సమర్థన..!!

గిరి బ్రాండ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ పరిధిని విస్తరించేందుకు ఈ-టెండర్‌ ప్రక్రియ ద్వారా ప్రధాన ఫ్రాంచైజీని ఎంపిక చేశామని జీసీసీ వైస్‌చైర్మన్‌ చెప్పారు. కానీ, ఆ టెండర్‌కు సంబంధించిన ప్రకటన వివరాలు, ఫ్రాంచైజీ దక్కించుకున్న సంస్థ వివరాలను వెల్లడించలేదు. కాగా, ఆంధ్రాకు చెందిన ప్రైవేట్‌ సంస్థకు ప్రాంచైజీ కట్టబెట్టగా.. ఆ సంస్థ జీసీసీ, జేఎల్‌జీ యూనిట్ల ఉత్పత్తులను కాకుండా సొంతంగా సమకూర్చుకున్న ఉత్పత్తులను సప్లయ్‌ చేస్తుంది. దీని వల్లే ఆర్డర్లు లేక కొన్ని యూనిట్లు మూతబడ్డాయి.


అయితే, ఇలా మూతపడ్డ పరిశ్రమల నుంచి జీసీసీకి 20శాతం మార్జిన్‌ ఎలా లభిస్తుందో ? అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. కాగా, ఏళ్లుగా సంస్థపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న చాలా మంది అధికారుల నిర్ణయాల వల్ల ప్రస్తుతం రోడ్డున పడ్డారు. అధికారుల తీరుతో పరిశ్రమలు మూతబడి ఉట్నూర్‌ డివిజన్‌లో 80 మంది కార్మికులు సహా 400 మంది స్థానిక గిరిజనులు ఉపాధి కోల్పోయారంటూ ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం దూబార్‌పేట్‌కు చెందిన చకాటి సాయికుమార్‌ జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషన్‌.. వాస్తవపరిస్థితిపై పది రోజుల్లోగా వాస్తవాలు తెలియజేయాలని ఈ నెల 19న జీసీసీ జీఎంకు నోటీసు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు

14 మంది మిల్లర్ల అరెస్టు

పౌరసరఫరాల్లో వసూళ్ల దందా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:13 AM