Share News

పౌరసరఫరాల్లో వసూళ్ల దందా!

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:58 AM

పౌరసరఫరాల సంస్థ మహబూబాబాద్‌ జిల్లా మేనేజరు నరసింహారావు ఇంట్లో ఇటీవల ఏసీబీ తనిఖీలు చేపట్టగా.. ఏకంగా రూ.100కోట్లకుపైగా అక్రమాస్తులు బయటపటడ్డాయి. తనిఖీల్లో రూ.కోట్ల విలువైన ఆస్తులు, నోట్ల కట్టలు బయటపడుతుంటే... ఏసీబీ అధికారులే ముక్కు న వేలేసుకున్నారు.

పౌరసరఫరాల్లో వసూళ్ల దందా!
Telangana civil supplies corruption

  • జిల్లాల్లోని రైస్‌ మిల్లర్లతో అధికారుల మిలాఖత్‌..

  • వడ్లు కేటాయించినా, బియ్యం పాస్‌ చేసినా పైసలే

  • ధాన్యం, బియ్యం రవాణా ప్రక్రియలోనూ అదే తంతు

  • ఓ జిల్లా స్థాయి అధికారికి ఏటా 3 కోట్లపైనే ఆదాయం?

  • ఇటీవల రూ.100 కోట్ల ఆస్తులతో ఏసీబీకి దొరికిన డీఎం

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల సంస్థ మహబూబాబాద్‌ జిల్లా మేనేజరు నరసింహారావు ఇంట్లో ఇటీవల ఏసీబీ తనిఖీలు చేపట్టగా.. ఏకంగా రూ.100కోట్లకుపైగా అక్రమాస్తులు బయటపటడ్డాయి. తనిఖీల్లో రూ.కోట్ల విలువైన ఆస్తులు, నోట్ల కట్టలు బయటపడుతుంటే... ఏసీబీ అధికారులే ముక్కు న వేలేసుకున్నారు. అయితే, ఇలాంటి నరసింహారావు లు.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదనే వాదన వినిపిస్తోంది. ఒక జిల్లా స్థాయి అధికారి.. రైస్‌ మిల్లర్ల దందాను చూసీచూడనట్లు వదిలేస్తే... ఏడాదికి తక్కువలో తక్కువ రూ.3 కోట్ల ఆదాయం వస్తుందని, కాస్త మిల్లర్లను టార్గెట్‌ చేస్తే... రూ.10కోట్లపైగా అక్రమ సంపాదన వస్తుందనే ఆరోపణలున్నాయి.


సాధారణంగా రేషన్‌ కార్డుల జారీ, రేషన్‌ బియ్యం పంపిణీపై పర్యవేక్షణ, రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు, అక్రమ విక్రయాలపై చర్య లు తీసుకోవటం, ప్రభుత్వ ఆదేశాల అమలును పర్యవేక్షించడం వంటి బాధ్యతలు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో)కి ఉంటాయి. అన్నింటికి మించి రైస్‌ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు వీరి చేతిలోనే ఉంటా యి. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు (డీఎం)కు ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ, పీపీసీల నుంచి రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని రవాణా చేయించడం, కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌(సీఎంఆర్‌) సేకరించడం, ధాన్యం, బియ్యం నిల్వలు, నాణ్యత, రవాణా, స్టాక్‌ లెక్కలు పర్యవేక్షించడం, నిల్వల్లో తేడాలు పరిశీలించడం వంటి బాధ్యతలు ఉంటాయి.


ఒక డీఎం, డీఎస్‌వో, ఆ జిల్లా రైస్‌ మిల్లర్లు మిలాఖత్‌ అయితే చాలు... రూ.కోట్లు చేతులు మారుతుంటాయనే ఆరోపణలున్నాయి. పౌరసరఫరాల శాఖలో అయినా, కార్పొరేషన్‌లో అయినా... ప్రతి పనికి ఒక రేటు ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల మహబూబాబాద్‌, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో కేసులు నమోదైనా...రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతోందన్న వాదన ఉంది. పౌరసరఫరాల భవన్‌లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఓ డీజీఎంకు ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. ఆ అధికారి ఓ జిల్లాలో పనిచేసినప్పుడు ఏసీబీ వల నుంచి తృటిలో తప్పించుకొన్నట్లు తెలిసింది.


ప్రతి పనికి ఒక రేటు..

  • ఒక ఏసీకే (290 క్వింటాళ్లు) కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను పాస్‌ చేయడానికి జిల్లా మేనేజర్లు(డీఎంలు) రూ. 2,500-3,000 వరకు తీసుకుంటున్నారు. ఒక వేళ బియ్యం నాణ్యత బాగోలేకపోతే... ఒక్కో లారీకి (580 బస్తాలు) గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటానికి రూ.30,000- 50,000 వరకు వసూలు చేస్తారు. రేషన్‌ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేసిన బియ్యాన్ని మార్కెట్లో కొని రీ-సైక్లింగ్‌ చేసి తీసుకొస్తే.. మిల్లరును బట్టి, బియ్యం నాణ్యతను బట్టి రేటు ఉంటుంది.

  • కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌డబ్ల్యూసీ) గోదాముల్లో దించిన తర్వా త... అక్కడ ఫ్యూమిగేషన్‌ చేసి, నిల్వచేసి మండలస్థాయి స్టాక్‌ పాయింట్లు(ఎంఎల్‌ఎస్)కు పంపిస్తారు. ఆ బస్తా బరువు 51 కిలోలు ఉంటుంది. గోదాముల నిర్వాహకులు, జిల్లా మేనేజర్లు మిలాఖత్‌ అయి.. ఆ బస్తాలకు రంధ్రాలుచేసి బియ్యం తీస్తారు. అలా పోగేసిన బియ్యాన్ని మరొక ఏసీకే కింద తయారు చేసి రైస్‌మిల్లర్లతో బేరం మాట్లాడుకుంటారు. ఒక ఏసీకే బియ్యం విలువ రూ.10లక్షల వరకు ఉంటే.. రూ.6-7లక్షలకు అమ్మేసి.. సొమ్ము చేసుకుంటారు. ఇది ప్రతి జిల్లాలో నిత్యకృత్యంగా మారింది.

  • ధాన్యం కేటాయింపులు చేసినందుకు గాను ఒక్కో డీఎ్‌సవో(జిల్లా పౌరసరఫరాల అధికారి) ఒక బస్తాకు రూ.2-3 తీసుకుంటారు. అంటే ఒక మిల్లులో లక్ష బస్తాలు దిగితే... 2-3 లక్షల ఆదాయం వస్తుంది. సన్న ధాన్యం కేటాయింపులు ఎక్కువ చేస్తే... బస్తాకు రూ.5 ఇచ్చేందుకు కూడా మిల్లర్లు ముందుకొస్తున్నారు.

  • రైస్‌ మిల్లుల్లో భౌతిక తనిఖీలు చేశారంటే... డీఎస్‌వోలకు కాసుల పంట పండినట్టే. మిల్లుల్లో ధాన్యం మాయమైనా... కేసులు రాయకుండా ఉండాలంటే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఒకవేళ టాస్క్‌ఫోర్సు బృందాలు అవే మిల్లుల్లో తనిఖీలు చేసినప్పుడు విషయం బయటపడితే... ఒకరోజు ముందే మిల్లరు అమ్ముకుని ఉంటారని కలరింగ్‌ ఇచ్చేస్తారు.

  • కొత్త రైస్‌ మిల్లులకు అనుమతులు, మిల్లు కోడ్‌, ఎన్‌వోసీ జారీచేసినా రూ.3-5లక్షలు వసూలు చేస్తారు. ధాన్యం కేటాయించే, తనిఖీలు చేసే బాధ్యత ఒక్కరికే ఉండడంతో అవినీతికి అడ్డూఅదుపు ఉండడం లేదు.


డీఎంల లీలలు మచ్చుకు కొన్ని...

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పని చేస్తున్న ఒక డీఎంపై గతంలో పలు ఆరోపణలొచ్చాయి. మిల్లర్లు, గోదాముల ఇన్‌చార్జిలతో కలిసి అక్రమ దందాలు చేయడంతోపాటు ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నియామకాల్లో భారీ వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కుటుంబ సభ్యుల్లో చాలా మందిని టెక్నికల్‌ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌పై నియమించి చక్రం తిప్పుతున్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వ హయాంలో పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకున్నారు.

  • ప్రభుత్వానికి రూ.9 కోట్లు ఎగ్గొట్టిన రైస్‌ మిల్లరుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పనిచేస్తున్న డీఎం అండగా నిలిచినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సదరు రైస్‌ మిల్లరు రూ.కోటి ముట్టజెప్తే.. కొంత మిల్లు ఏర్పాటు, పాత మిల్లు రికార్డులు మాయం చేయ టానికి సహకరించినట్లు సమాచారం. ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో పనిచేసినప్పుడూ ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఒక మేనేజర్‌కు అరుదైన చరిత్ర ఉంది. సదరు డీఎం ఎక్కడ పని చేస్తే అక్కడ గోనె సంచుల గోదాములకు అగ్నిప్రమాదం జరిగి కాలిబూడిదైపోతాయనే విమర్శలున్నాయి. రైస్‌మిల్లర్లు బార్‌దాన్‌ తిరిగి ఇవ్వకపోయి నా.. ఇచ్చినట్లు లెక్కలురాసి, వాటి విలువకు తగినట్లుగా డబ్బులు తీసుకొని.. గోదాములకు నిప్పు పెట్టిస్తారనే ఆరోపణలున్నాయి.

  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు మేనేజర్లు తోడళ్లుల్లా కలిసిపోతారనే టాక్‌ ఉంది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వాళ్లే పోస్టులు మార్చుకుంటారు. ఒకరి అక్రమాలను మరొకరు సమాధి చేస్తారు. ఇలా దశాబ్ద కాలంగా వీరిద్దరు కుర్చీలాట ఆడుతున్నా... పట్టించుకునే నాథుడే లేకపోవడం శోచనీయం.


ఈ వార్తలు కూడా చదవండి:

దుమ్ముగూడెం ఎత్తు పెంపు

14 మంది మిల్లర్ల అరెస్టు

తరుముకొస్తున్న తుఫాను

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:00 AM