Share News

దుమ్ముగూడెం ఎత్తు పెంపు

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:44 AM

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల మధ్య భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం పది అడుగుల లోపుకే పడిపోయింది.

దుమ్ముగూడెం ఎత్తు పెంపు
Thummala Nageswara Rao

  • 1.5 లక్షల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా మీటరు మేర..

  • ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాలప్రజల దాహార్తి తీర్చేందుకే..

  • పెంపుతో ఒక టీఎంసీ నీటి నిల్వ

  • పది రోజుల్లో పనులు పూర్తి

  • చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

కొత్తగూడెం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల మధ్య భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం పది అడుగుల లోపుకే పడిపోయింది. గత మూడేళ్లతో పోలిస్తే 4 నెలల ముందే గోదావరి నీటిమట్టం తగ్గిపోయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు అవసరాల కోసం గోదావరిలో నీటిని నిల్వ చేసి తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసిన సర్కారు.. అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు సమీపాన బ్రిటిష్‌ కాలం నాటి దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచి నీటిని నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 0.8 టీఎంసీ ల నీరు ఉంది.


సుమారు 1.50 లక్షల ఇసుక బస్తాలతో ఐదు లేయర్లు వేసి ఆనకట్ట ఎత్తు తాత్కాలికంగా ఒక మీటరు పెంచి.. ఒక టీఎంసీ నీటిని అదనంగా నిల్వ చేసుకోవచ్చు. తద్వారా 4 నెలలు మిషన్‌ భగీరథ ద్వారా ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు తాగునీరందించడానికి ప్రణాళిక సిద్ధం చేయగా, ఇప్పటికే ఒక లేయర్‌ ఇసుక బస్తాలు వేశారు. ప్రతి రోజూ 10 వేల ఇసుక బస్తాలతో 4 లేయర్లు పేర్చడంతో వచ్చే 10 రోజుల్లో తాత్కాలికంగా ఆనకట్ట ఎత్తు పెంచుతారు. ఈ పనులను ఆదివారం పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అవసరమైతే కూలీలను పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


రోహిణి కార్తె కంటే వంద రెట్లు వేడి

ఎల్‌నినో వల్ల రోహిణి కార్తె కంటే వంద రెట్లు వేడి ఎక్కువగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్మగూడెం ఆనకట్ట వద్ద పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 2,3 నెలల్లో దీని ప్రభావం మరింత తీవ్రమవుతుందని, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో 25 శాతం లోటు వర్షపాతం వల్ల చెరువులు, నదులు, వాగులు, నీటి ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు పరిమిత స్థాయికి చేరుకుంటే, భూగర్భ జలాలు 10 అడుగుల లోతుకు పడిపోయాయన్నారు. రబీ సీజన్‌ భీకరంగా ఉంటుందన్న తుమ్మల.. చరిత్రలోని లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కనుక, గోదావరి జలాలను నిల్వ చేసేందుకు దుమ్మగూడెం ఆనకట్ట ఎత్తు పెంచాలని నిర్ణయించామన్నారు. సమ్మక్క-సారక్క బ్యారేజీ వద్ద కూడా వీలైనంత మేరకు నీటి నిల్వలుంచాలని తెలిపామన్నారు. వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ చేయడంతోపాటు పంటల కొనుగోలు, రైతు భరోసా తదితర కార్యక్రమాలతో అన్నదాతలకు అండగా నిలుస్తామన్నారు. కరువు పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించి, అవసరమైన సహకారం కోసం కేంద్రాన్ని సంప్రదిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెండింగ్‌ ఎన్నాళ్లు?

‘తుమ్మిడిహెట్టి’కి ఎలాగైనా ఒప్పిద్దాం

తరుముకొస్తున్న తుఫాను

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:44 AM