పెండింగ్ ఎన్నాళ్లు?
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:21 AM
రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, రైళ్ల ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో ముందుకు కదలట్లేదు. అవి పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ అవి ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
ముందుకు కదలని కీలక ప్రాజెక్టులు
నిధుల సమస్యలతో కొన్ని..
అనుమతుల దశలోనే ఇంకొన్ని..
ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో విస్తరణ, హైస్పీడ్ రైళ్ల పనులు కదిలినట్టే కదిలి వెనకడుగు
ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే.. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై స్పందన శూన్యం
ఆదిలాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్ విమానాశ్రయాలూ పెండింగ్‌లోనే..
ఎనిమిదేళ్లుగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు.. మేడ్చల్-సుచిత్ర ఫ్లై ఓవర్లూ అంతే
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు టెండర్లు.. ఆమోదం తెలపని కేంద్ర క్యాబినెట్
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, రైళ్ల ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో ముందుకు కదలట్లేదు. అవి పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ అవి ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు అనుమతులన్నీ లభించినా, నిధుల సమస్యతో నిలిచిపోతే.. మరికొన్ని అనుమతుల దశలోనే ఉండిపోయాయి. ఇంకొన్ని ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందనారాకపోవడంతో అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రీజినల్ రింగురోడ్డు, రీజినల్ రింగు రైలు, మూడు మార్గాల్లో ప్రతిపాదించిన హై స్పీడ్ రైళ్లు, ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులు.. ఆదిలాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్ విమానాశ్రయాల అంశం పెండింగ్‌లోనే ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గర ప్రారంభించిన ఎలివేటెడ్ కారిడార్ పనులు, మేడ్చల్ నుంచి సుచిత్ర వరకు మొదలుపెట్టిన ఫ్లై ఓవర్ పనులు ఏళ్లతరబడి నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఏదో ఒక దశలో, అంశంలో కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని.. కానీ, వాటి విషయంలో కేంద్రం ఆశించిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలేదని, మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్, ఇతర జాతీయ రహదారుల విషయంలో జాప్యం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక.. కీలకమైన మూసీ పునరుజ్జీవన పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రతిపాదిత హైదరాబాద్ గేట్ వే పనుల విషయంలోనూ ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఇప్పటివరకూ డిజైన్లను మాత్రమే ప్రకటించారు.
ఇవికాక కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు విషయం ఒక పట్టాన కొలిక్కొరావట్లేదు. రాష్ట్రం- కేంద్రం మధ్యన చర్చలు జరుగుతున్నా.. మెట్రో మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధుల రుణ సేకరణ, రెండో దశ విస్తరణకు అవసరమయ్యే నిధుల సేకరణ అంశాలపై ఎటూ తేలట్లేదు. వాస్తవానికి మొదటి దశ ఎవాల్యుషన్, రెండో దశ విస్తరణకు అవసరమయ్యే నిధుల అంచనా, రుణ సేకరణ కోసం ‘ఎస్‌బీఐ క్యాప్స్’ను కేంద్రం కన్సల్టెంట్‌గా నియమించింది. కానీ ఈ అంశంపై ఎస్‌బీఐ క్యాప్స్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాంతో రుణ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రయత్నాలు ప్రారంభించింది.
సాగని విస్తరణ..
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు 285 కిలోమీటర్ల మేర 6 వరుసల విస్తరణకు ఆమోదం లభించింది. రూ.12,073.99 కోట్లతో విస్తరణ పనులు చేపట్టేందుకు పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నిర్మించే రెండు ప్యాకేజీలను బిల్డ్-ఆపరేట్-టోల్ (బోట్) పద్ధతిలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో పనులు చేయనున్నారు. విస్తరణ పనులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో చేపట్టనున్నారు.
ఈ మార్గం మొత్తాన్నీ ‘హైస్పీడ్ కారిడార్’గా మార్చనున్నారు. ఇటీవలనే విస్తరణకు టెండర్లను కూడా ఆహ్వానించారు. కానీ ఈ మార్గం విస్తరణలో అత్యంత కీలకమైన కేంద్ర క్యాబినెట్ నుంచి రావాల్సిన ఆమోదం ఇంకా ఇవ్వలేదు. క్యాబినెట్ అనుమతి లేకుండానే టెండర్లను ఆహ్వానించారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం విషయంలోనూ టెండర్లు ఆహ్వానించినా.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేకపోవడంతోనే ఆ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. ఇపుడు విజయవాడ రోడ్డు విస్తరణ విషయంలో అదే పరిస్థితి నెలకొనడంతో ఈ రెండు ప్రాజెక్టులకూ కేంద్ర క్యాబినెట్‌లో అనుమతి ఎప్పుడు వస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
హై స్పీడ్ రైళ్ల పనులు పెండింగే..
తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైలకు కేంద్రం ప్రతిపాదించిన హై స్పీడ్ రైలు కారిడార్‌లపైనా ప్రతిష్టంభన నెలకొంది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్-ముంబై-పుణె కారిడార్ 93 కిలోమీటర్లు, హైదరాబాద్-బెంగళూరు 205 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదించిన మార్గం 180 కిలోమీటర్లుగా అలైన్‌మెంట్లు చేశారు. హై స్పీడ్ రైల్ కారిడార్‌లు, అలైన్‌మెంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో కొద్ది కాలంగా కేంద్రప్రభుత్వ రైల్వే కీలక అధికారులు చర్చలు జరుపుతూ వచ్చారు. ఈ మూడు కారిడార్‌ల అలైన్‌మెంట్లు, ప్రతిపాదిత స్టేషన్లకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
దాని ప్రకారమే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లోని బహుదూర్‌గూడ వద్ద హై స్పీడ్ రైల్వే హబ్ ఏర్పడుతుందన్న విషయంతో పాటు మూడు రైల్వే మార్గాలు ఎటు నుంచి ఎలా వెళ్తాయన్నది తెలిసింది. ఇక భూసేకరణే తరువాయి అనే సమయానికి.. అసలు కారిడార్‌లకు అలైన్‌మెంటే ఖరారు కాలేదని, కాబట్టి భూసేకరణ చేపట్టడంచట్ట విరుద్ధమని రైల్వే మంత్రి అన్నారు. ఆ మూడు హై స్పీడ్ రైలు కారిడార్ల భూసేకరణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రతిపాదనలూ పంపలేదని చెప్పారు. ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని, అవి పూర్తయి, మార్గాలను ఖరారు చేశాకే రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆ ప్రాంత రైతులకు భూ సేకరణ, కారిడార్ అలైన్‌మెంట్ల విషయాలను తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ మార్గాలపై స్పష్టతరాలేదు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే.. శ్రీశైలం కారిడార్ ఎప్పటికో..
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకూ ‘గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే’ను ప్రతిపాదించింది. రోడ్డును మంజూరు చేయాలంటూ కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసింది. అయితే హైదరాబాద్-విజయవాడ రోడ్డునే విస్తరిస్తున్నామని, కొత్త రోడ్డు ప్రతిపాదనేదీ లేదంటూ కేంద్రం గతంలో రాష్ట్రానికి లేఖలు రాసింది. కానీ ఇంతవరకూ ఆ కొత్త ఎక్స్‌ప్రెస్ వేపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు ప్రతిపాదించిన ‘శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్’ ప్రాజెక్టు కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంది. ఈ మార్గం పూర్తయితే శ్రీశైలంతో పాటు ఏపీ వెళ్లేందుకు ప్రయాణ సమయం చాలా వరకూ తగ్గనుంది.
విమానాశ్రయాలపై లేఖలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో వరంగల్ జిల్లాలో ప్రతిపాదించిన మామునూరు ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమమైంది. ఇటీవలనే టెర్మినల్స్ సహా ఇతర నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఎంత భూమి కావాలన్నది ఇటీవలే ఖరారైంది. కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. పనులు నిదానంగా సాగుతున్నాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టుల పనుల విషయంలో స్పష్టతలేదు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు కోసం ఇప్పటికే దాదాపు మూడు సార్లకుపైగా సర్వేలు చేసినా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఆ ఫ్లై ఓవర్లు.. ఇంకెన్నాళ్లు?
హైదరాబాద్ నగరం నుంచి బయటి ప్రాంతాలకు త్వరితగతిన వెళ్లేందుకు ప్రతిపాదించి, పనులు ప్రారంభించిన మేడ్చల్-సుచిత్ర ఫ్లై ఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలుపెట్టి దాదాపు 8 ఏళ్లు అవుతున్నా.. ఇంకా పనులు చివరిదశకు చేరుకోలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యం ట్రాఫిక్‌లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ నుంచి సుచిత్ర వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు కూడా ఆలస్యమవుతన్నాయి. ఈ పనులు ప్రారంభమై దాదాపు 5 ఏళ్లవుతున్నా పూర్తయ్యేదశకు చేరుకోలేదు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందన్నది అంతుచిక్కకపోవడం గమనార్హం.
రీజినల్ రింగు రోడ్డు.. రైలు!
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రానికి మంజూరు చేసింది. దాదాపు పదేళ్లవుతున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి రాలేదు. 2017లో ఈ రోడ్డును ఉత్తర, దక్షిణభాగాలుగా విభజించారు. ఉత్తరభాగం భూసేకరణ పనులు ఇంకా పూర్తవ్వ లేదు. అయినా 2 ప్యాకేజీలతో 161 కిలోమీటర్ల (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) మేర నిర్మాణానికి టెండర్లను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆహ్వానించింది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా అది టెండర్ల దశలోనే ఉంది. దీని నిర్మాణానికి రూ.23,830 కోట్లు అవుతుందని అంచనా. టెండర్లు ఆహ్వానించి, ప్యాకేజీలు ఖరారయినప్పటికీ కేంద్ర క్యాబినెట్ నుంచి రావాల్సిన అనుమతులు ఇంకా రాలేదు.
అక్కడ పెండింగ్ ఉండడంతోనే ఈ ఉత్తరభాగం రోడ్డు పనులు ముందుకు కదలట్లేదు. దక్షిణభాగం పరిస్థితీ ఎటూ తేలట్లేదు. కేంద్రం దక్షిణ భాగంపై స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును చేపట్టేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రాజెక్టును రోడ్లు-భవనాల శాఖ పరిధి నుంచి తప్పిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అనుబంధంగా ఉండే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)కు అప్పగిచింది. నిర్మాణం, భూసేకరణ తదితర బాధ్యతలన్నింటినీ హెచ్‌జీసీఎల్‌కు బదిలీ చేసింది. దీంతో ఈ భాగం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి చేరినట్టైంది. ఈ రహదారి నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా. మరోవైపు ఈ ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆనుకునే రీజినల్ రింగు రైలు ప్రాజెక్టును కూడా కేంద్రం మంజూరు చేసింది. గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు 5-10 కిలోమీటర్ల దూరంలో ఉండగా, దానిని మార్చుతూ రింగు రోడ్డుకు పక్కనే నిర్మించాలని నిర్ణయించింది. కానీ ఇంతవరకూ పనులు పెద్దగా ముందుకెళ్లలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News