Share News

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:25 AM

హైదరాబాద్‌లోని హకీంపేటలో గల హుడా హైట్స్‌లో చదరపు గజానికి అప్‌సెట్‌ (కనీస) ధరను రూ.2 లక్షలుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు
HMDA Plot Auction 2026

  • వెయ్యి గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన

  • ప్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నిర్ణయం

  • కోకాపేట, మూసాపేట భూములు, బాచుపల్లి సహా

  • పలు ప్రాంతాల్లోని ప్లాట్ల అమ్మకానికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హకీంపేటలో గల హుడా హైట్స్‌లో చదరపు గజానికి అప్‌సెట్‌ (కనీస) ధరను రూ.2 లక్షలుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. హుడా హైట్స్‌లో కోట్లు విలువ చేసే వెయ్యి చదరపు గజాలకు పైగా విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయించడానికి శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో పాటు కోకాపేట, మూసాపేటలోని భూములతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మరో ఆరు ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ స్థలాలను, బాచుపల్లి, ఇన్ముల్‌నర్వలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాటను అమ్మకానికి పెట్టారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆరు విడుతలుగా ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది.


కోకాపేటలోని నియోపోలీసు లేఅవుట్‌లో తాజాగా మరో 4.59 ఎకరాలను విక్రయానికి పెట్టగా.. అప్‌సెట్‌ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నిర్ణయించారు. కోకాపేటలోనే 8,591 చ.గజాల స్థలాన్ని కూడా చ.గజాల్లో అమ్మకానికి పెట్టగా.. అప్‌సెట్‌ ధర చ.గజానికి రూ.1.50 లక్షలు పెట్టారు. ఇటు కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేటలో 3 ఎకరాల ప్లాట్‌ను సైతం విక్రయానికి పెట్టగా.. ఎకరం అప్‌సెట్‌ ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. ఇక శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం నౌఖల్సాలో 1,815 చ.గజాల స్థలాన్ని విక్రయిస్తుండగా.. అప్‌సెట్‌ ధర చ.గజానికి రూ.1.75 లక్షలు పెట్టారు. బాచుపల్లిలో 2,420 చ.గజాలు, సూరారంలో 4,840 చ.గజాలు, కాప్రాలో 484 చ.గజాలు, అమీన్‌పూర్‌ మండలం కృష్ణారెడ్డిపేటలో 1,452 చ.గజాలు, అమీన్‌పూర్‌లో 514 చ.గజాల రెండు స్థలాలను, 302 చ.గజాల స్థలాన్ని విక్రయానికి పెట్టారు.


బాచుపల్లి లేఅవుట్‌లో మరో 50 ప్లాట్లను వేలానికి హెచ్‌ఎండీఏ పెట్టింది. ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 266 చ.గజాల నుంచి 499 చ.గజాలతో ఉన్నాయి. చ.గజానికి అప్‌సెట్‌ ధర రూ.45 వేలుగా నిర్ణయించారు. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వలో 45 ప్లాట్లను విక్రయానికి పెట్టారు. మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయడానికి అనువుగా చ.గజానికి అప్‌సెట్‌ ధర రూ.15 వేలుగా నిర్ణయించారు. ఈ లేఅవుట్‌లో 152 చ.గజాల నుంచి 300 చ.గజాల వరకు విస్తీర్ణంలోని ప్లాట్లున్నాయి. ఆసక్తి కలిగిన వారు ప్రతి ప్లాట్‌కు రూ.3 లక్షలు ముందస్తు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వేలం వివరాలు తదితర వాటి కోసం నోటిఫికేషన్‌, లే అవుట్ల బ్రోచర్‌ను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జీసీసీని ముంచిన వాళ్లను శిక్షించాలి!

హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

బీఆర్‌ఎస్‌ నేతలకు బుర్ర లేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 05:25 AM