జీసీసీని ముంచిన వాళ్లను శిక్షించాలి!
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:11 AM
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసేలా జరిగిన భారీ కుట్రపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
అక్రమాలపై విచారణ జరిపించాలి
ఏపీ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలి
గిరిజన సంఘాల డిమాండ్
‘అడవి బిడ్డలకు అన్యాయం’..
ఆంధ్రజ్యోతి కథనంపై సీఎంవో వర్గాల ఆరా
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసేలా జరిగిన భారీ కుట్రపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు అధికారులు స్వార్థంతో జీసీసీని కుప్పకూల్చేందుకు చేస్తున్న కుట్రలను ఎండగడుతూ.. ‘అడవి బిడ్డలకు అన్యాయం’ పేరిట ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. సచివాలయం, జీసీసీలో ఇది చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) వర్గాలు సమగ్ర వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గిరిజన సంక్షేమ శాఖను అడ్డం పెట్టుకుని జీసీసీని భ్రష్టుపట్టించిన ఆ ఇద్దరు ఐఏఎ్‌సలు ఎవరు? వారికి లంచాలు ముట్టచెప్పి.. జీసీసీకి నష్టం కలిగించేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏపీకి చెందిన ప్రైవేటు కంపెనీ యజమాని ఎవరు? అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన సంక్షేమశాఖ అధికారుల నుంచి వారు వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. మరోవైపు, గిరిజన సంఘాలు సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. తెలంగాణ గిరిజనుల ప్రయోజనాలను కాలరాస్తూ, జీసీసీ కాంట్రాక్టును ఏపీకి చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి బంధువుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసిం ది.
ఈ నిర్ణయం వల్ల దశాబ్దాల పాటు గిరిజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచిన సొంత ప్రాసెసింగ్ యూనిట్లు నిరుపయోగంగా మారి పలువురు ఉపాధి కోల్పోయారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, శ్రీరాం నాయక్ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, ఐఏఎస్‌ల స్వార్థ ప్రయజనాలకు వేలాది మంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. ఆంధ్రా సంస్థకు ఇచ్చిన జీసీసీ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేసి, ఆ బాధ్యతలను గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన జీసీసీ ఉత్పత్తులను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత జాదవ్ సుమేశ్ ఖండించారు. ఐదవ షెడ్యూల్ హక్కులను కాలరాస్తూ జీసీసీని ఏ ప్రాతిపదికన బయటి ఏజెన్సీలకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ)కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కారుచవకగా తేనె కొనుగోలుకు ప్రతిపాదన
జీసీసీ సేకరించే నాణ్యమైన తేనెను మార్కెట్ ధరకంటే భారీగా తగ్గించి ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందు కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో తెచ్చిన ప్రతిపాదన తాజాగా చర్చనీయాంశమైంది. కొంతకాలం కిత్రం.. సదరు సీనియర్ ఐఏఎస్ గిరిజనులు సేకరించే తేనెను మొత్తం తనకు ఇచ్చేస్తే.. తనే మార్కెటింగ్ చేస్తానని ఒక ప్రతిపాదన పెట్టారని సమాచారం. ఆ సమయంలో మార్కెట్‌లో గిరి బ్రాండ్ పేరిట కిలో తేనెను రూ.280 చొప్పున విక్రయిస్తుంటే.. ఆ అధికారి మాత్రం కిలో రూ.100 చొప్పున తాను చెప్పిన ప్రైవేట్ సంస్థకు అంఅందించాలని అడిగారని, అయితే, ఆ ప్రతిపాదనను ఇతర అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
2027 జూన్ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి
హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News