2027 జూన్ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను 2027 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు నీటిపారుదల శాఖ సలహాదారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు.
వాటి నిర్మాణానికి వాడినంత కాంక్రీట్ మరమ్మతులకూ వాడాలి
స్టిల్లింగ్ బేసిన్ విస్తరించాలి..
ఎగువన, దిగువన డయాఫ్రం వాల్స్ కట్టాలి
నీటిపారుదల శాఖ సలహాదారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను 2027 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు నీటిపారుదల శాఖ సలహాదారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు. బ్యారేజీల పునరుద్ధరణకుప్రాథమిక డిజైన్లను సిద్ధం చేశామని, వాటికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. తుది డిజైన్లకు ఆమోదం లభించగానే పనుల అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్యారేజీల పునరుద్ధరణ ప్రణాళికపై పరీక్షిత్ మెహ్రా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యారేజీల నిర్మాణం సాంకేతికంగా 50 శాతమే పూర్తయ్యిందని తెలిపారు. వాటి నిర్మాణంలో ఎంత కాంక్రీట్‌ను వినియోగించారో ఇప్పుడు మరమ్మతులకు అంతే పరిమాణంలో వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. స్పిల్‌వే నుంచి విడుదల చేసే వరద ఉధృతి శక్తి దిగువన నేలకు తాకినప్పుడు అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయని, బ్యారేజీల్లో నిల్వ చేసిన నీళ్లు వాటి పునాదుల కింది నుంచి ప్రవహిస్తూ ఈ గుంతల ద్వారా ఉబికి రావడంతో బ్యారేజీలకు నష్టం జరిగినట్టు పరీక్షల్లో తేలిందని వివరించారు. ఈ లోపాన్ని సరిచేయడానికి స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించాల్సి ఉంటుందన్నారు.
స్పిల్‌వే పొడవును మేడిగడ్డలో 46.8 మీటర్ల నుంచి 66 మీటర్లకు, అన్నారంలో 45 మీటర్ల నుంచి 66 మీటర్లకు, సుందిళ్లలో 30 మీటర్ల నుంచి 58 మీటర్లకు పొడిగించాల్సి ఉంటుందని వెల్లడించారు. బ్యారేజీల ఎగువన, దిగువన డయాఫ్రం వాల్స్‌ను నిర్మించి, వాటి పునాదులను ఆర్‌సీసీ కటా్‌ఫతో పటిష్టపరుస్తామని చెప్పారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ విషయంలో మూడు ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. దెబ్బతిన్న 6 పియర్లను తొలగించి, వాటిని పునర్నిర్మించి స్టిల్లింగ్ బేసిన్ సామర్థ్యాన్ని పెంచితే సరిపోతుందా...? లేక వాటిని తొలగించి క్రస్ట్ పాండ్ స్థాయికి స్పిల్‌వేను పొడిగించి పునర్నిర్మించాలా...? లేక ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి డిజైన్‌లో పలుమార్పులతో కొత్తగా పునర్నిర్మించాలా...? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తుమ్మిడిహెట్టిపై రేపు మహా చర్చలు
ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News