ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్!
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:46 AM
మహిళల పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. వలపు వల విసిరి.. సుమారు వెయ్యి మందిని బ్లాక్‌మెయిల్ చేసిన పవన్‌కుమార్.. బాధితుల్లో ఒకరైన ఓ ఇన్‌స్పెక్టర్‌ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు తెలిసింది.
హనీట్రాప్‌తో ఆకర్షించి.. లాడ్జికి రప్పించి..
మానసిక వేదనకు గురిచేసిన పవన్‌కుమార్
అభ్యంతరకర చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. రూ.8 లక్షలు వసూలు
సీఐ భార్య ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం
కస్టడీకి పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
బాధితుల్లో ఆరుగురు పోలీసు అధికారులు?
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళల పేరుతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. వలపు వల విసిరి.. సుమారు వెయ్యి మందిని బ్లాక్‌మెయిల్ చేసిన పవన్‌కుమార్.. బాధితుల్లో ఒకరైన ఓ ఇన్‌స్పెక్టర్‌ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు తెలిసింది. ఓ పోలీస్‌స్టేషన్‌లో డీఐగా విధులు నిర్వహిస్తున్న ఆ ఇన్‌స్పెక్టర్‌ను హనీట్రాప్‌తో ఆకర్షించిన నిందితుడు.. ఈ క్రమంలో ఆయనకు ఓ ‘బలహీనత’ ఉన్నట్లు కొద్దిరోజుల్లోనే గుర్తించాడు. దానిని ఆసరాగా చేసుకొని సీఐని ఓ లాడ్జికి రప్పించాడు. అలా పలుమార్లు ఆ లాడ్జికి రప్పించి.. అదే ‘బలహీనత‘ ఉన్న తానూ అక్కడే ఉంటూ సీఐకి సంబంధించి కొన్ని అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు తీసుకున్నాడు.
వాటిని చూపించి ఆ ఇన్‌స్పెక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి ఆయన వద్ద నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.. ఇలా సుమారు ఆరు నెలలపాటు సీఐని అదే లాడ్జికి రప్పించి తనతోపాటే ఉండేలా చేసుకొని తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు తెలిసింది. హైదరాబాద్ సిటీ పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి విచారించిన క్రమంలో ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం. అంతేకాదు.. తన కన్నతల్లి మరణించినా నిందితుడు పవన్‌కుమార్ వెళ్లలేదని తెలిసింది. తాను ఊరికి వెళితే ఇన్‌స్పెక్టర్ తన చేతి నుంచి తప్పించుకుంటాడనే ఉద్దేశంతోనే వెళ్లకపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో కేసులో అరెస్టవడంతో..
పవన్‌కుమార్ చేతిలో బందీగా ఉన్న సమయంలోనే ఇన్‌స్పెక్టర్‌పై మరో ఇతర కేసు నమోదైంది. గతంలో పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల కేసులో సదరు సీఐ జైలుకెళ్లాల్సి వచ్చింది. అలా ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి జైలుకు తరలించే క్రమంలో పవన్‌కుమార్ హనీట్రాప్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ సహా.. అతని బారిన పడి వందలాది మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని ద్వారా మానసిక క్షోభను అనుభవించిన ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో రంగప్రవేశం చేసి పవన్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు అతని బారిన పడి మోసపోయిన 82 మంది బాధితులను గుర్తించిన పోలీసులు.. మరింత మందిని గుర్తించడానికిగాను అతణ్ని సోమవారం కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇందుకోసం కోర్టులో ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తన భర్తను హనీట్రాప్ చేసి మానసిక క్షోభకు గురిచేసి, అరాచకం సృష్టించి రూ. లక్షల్లో డబ్బులు కొట్టేసిన పవన్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ సీఐ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కస్టడీలో విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే బాధితుల్లో డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు మొత్తం ఆరుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వారు ఎవరు? ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? వారి నుంచి నిందితుడు ఎంత మొత్తంలో డబ్బులు కొల్లగొట్టాడు? అనే విషయాలపై కస్టడీలో నిందితుణ్ని విచారించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
తుమ్మిడిహెట్టిపై రేపు మహా చర్చలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News