పండుగ వేళ షాపింగ్ వెలవెల
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:18 AM
పట్టణాల్లో షాపింగ్ ఉత్సాహం తగ్గుతోంది. పండుగల సందర్భంగా షాపింగ్‌మాల్స్ వద్ద సందడి కనిపిస్తున్నప్పటికీ.. కొనుగోళ్ల విషయంలో మాత్రం కుటుంబాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
పట్టణాల్లో తగ్గుతున్న కొనుగోళ్లు
2025లో రూ.2.10 లక్షల కోట్లు..
ఈసారి 1.97 లక్షల కోట్లకు పరిమితం!
ధరల సెగ, వడ్డీ రేట్ల భారం, ఎల్‌నినో
నేపథ్యంలో జాగ్రత్త పడుతున్న ప్రజలు
షాపింగ్‌కు 31 శాతం కుటుంబాలు దూరం
కొనుగోళ్లు చేస్తున్న వాళ్లు కూడా..
పొదుపు డబ్బులతో పరిమితంగానే
దేశమంతా ఇదే తీరు.. సర్వేలో వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో షాపింగ్ ఉత్సాహం తగ్గుతోంది. పండుగల సందర్భంగా షాపింగ్‌మాల్స్ వద్ద సందడి కనిపిస్తున్నప్పటికీ.. కొనుగోళ్ల విషయంలో మాత్రం కుటుంబాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇటీవలి దసరా పండుగ సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి పలు కారణాలు.. నిత్యావసరాల ధరల పెరుగుదల, రుణాలపై వడ్డీ రేట్ల పెంపు, ఎల్‌నినో ప్రభావం. ఫలితంగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పండుగల సందర్భంగా దేశంలోని పట్టణాలు, నగరాల్లో ప్రజల షాపింగ్ వ్యయం 6 శాతం తగ్గనుందని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. 2025లో పట్టణ కుటుంబాల పండుగ ఖర్చులు రూ.2.10 లక్షల కోట్లు నమోదు కాగా, ఈ ఏడాది అది రూ.1.97 లక్షల కోట్లకు తగ్గనుందని ఈ సర్వే అంచనా వేసింది. ఒక్కో కుటుంబం సగటున రూ.20 వేల వరకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 307 జిల్లాల్లో సర్వే
సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 307 జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు చెందిన కుటుంబాల నుంచి 67 వేల మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించారు. దీంట్లో వెల్లడైన అంశాలు.. 57 శాతం కుటుంబాలు మాత్రమే తాజా పండుగ సీజన్లో కొనుగోళ్లు చేయాలని భావిస్తున్నాయి. 31 శాతం కుటుంబాలు కొనుగోళ్లు చేయబోమని పేర్కొన్నాయి. కొనుగోళ్లు చేయాలనుకుంటున్న కుటుంబాల్లో 18 శాతం కుటుంబాలు.. పండుగ షాపింగ్ బిల్లును రూ.10 వేలలోపు పరిమితం చేయాలని నిర్ణయించుకోగా, 30 శాతం కుటుంబాలు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు, 9 శాతం కుటుంబాలు రూ.లక్షకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాయి. కాగా 83 శాతం కుటుంబా లు తాము దాచుకున్న సొమ్ము నుంచే ఖర్చు చేయనుండగా, 17 శాతం కుటుంబాలు మాత్రమే పొదుపు సొమ్మును ముట్టుకోకుండా ప్రస్తుత ఆదాయంతోనే పండుగ ఖర్చులు భరించాలని భావిస్తున్నాయి.
దుస్తుల కొనుగోళ్లకే తొలి ప్రాధాన్యం
పండుగ షాపింగ్‌లో దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు ప్రజలు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుగోళ్లు చేయనున్న కుటుంబాల్లో 72 శాతం.. దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. 45 శాతం కుటుంబాలు గృహోపకరణాలు, ఫర్నీచర్ కొనుగోలుకు ఆసక్తి చూపుతుండగా.. మరో 45 శాతం కుటుంబాలు ప్రయాణాలు, విహారయాత్రలకు ఖర్చు చేయాలని భావిస్తున్నాయి. 39 శాతం కుటుంబాలు ఆహార పదార్థాలు, బహుమతుల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నాయి. మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాల కొనుగోళ్లకు 22 శాతం కుటుంబాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం పండుగ కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది 6 శాతం కుటుంబాలు మాత్రమే ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.
ధరల సెగ.. వడ్డీ రేట్ల భారం
పండుగ ఖర్చులు తగ్గడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమేనని సర్వే విశ్లేషించింది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరగా.. ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం కూడా 11.39 శాతానికి పెరిగింది. ఈ నెల 7వ తేదీన ఆర్బీఐ రెపోరేటును 0.25 శాతం పెంచి 5.50 శాతానికి చేర్చింది. దీంతో రుణాలపై వడ్డీ భారం పెరిగే పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది నాటికి ధరలు మరో 9.4 శాతం పెరగవచ్చని పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. నిత్యావసరాల ఖర్చులకు ప్రాధాన్యమిస్తూ.. పండుగ కొనుగోళ్లను పరిమితం చేసుకుంటున్నాయి.
పండుగ ఖర్చుల విషయంలో గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. 2024లో పట్టణ కుటుంబాల మొత్తం పండుగ ఖర్చులు రూ.1.85 లక్షల కోట్లు కాగా, 2025లో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావంతో 14 శాతం పెరిగి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2026లో మళ్లీ 6ు తగ్గి రూ.1.97 లక్షల కోట్లకు పరిమితం కానున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దాని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రజలు పండుగ ఖర్చులు తగ్గించుకోవటానికి ఇది కూడా ఒక కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News