Share News

రోడ్లు వేయరు.. రిపేరు చేయరు

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:08 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన హ్యామ్‌ రోడ్ల పనుల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది.

రోడ్లు వేయరు.. రిపేరు చేయరు
Telangana HAM Roads

  • ఆర్‌అండ్‌బీలో హ్యామ్‌ రోడ్లకు నిధుల సమస్య

  • హడ్కో రుణం ఇస్తానన్నా.. వడ్డీరేటుపై పేచీ

  • పనులు ప్రారంభించి నాలుగు నెలలవుతున్నా..

  • కిలోమీటరు రోడ్డు కూడా నిర్మించని వైనం

  • హ్యామ్‌ రోడ్ల జాబితాలో ఉండడంతో మరమ్మతులకు నోచుకోని రోడ్లు.. ప్రజల అవస్థ

ఈ రోడ్డు నారాయణపేట జిల్లా నుంచి మక్తల్‌ నియోజకవర్గానికి వెళ్లే మార్గం. 26 కి.మీ. ప్రయాణించడానికి గంటన్నర సమయం పడుతోంది. దారి అంతా గుంతలమయం కావడమే ఇందుకు కారణం. రోడ్డుపై సింగారం చౌరస్తా నుంచి 700 దాకా గుంతలున్నట్లు వాహనదారులు లెక్కించి మరీ చెబుతున్నారు. అంబులెన్స్‌లో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వణుకు పుడుతోంది. గత డిసెంబరులో సీఎం రేవంత్‌ 200 కోట్లతో 4 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత హ్యామ్‌ పరిధిలోకి తీసుకువచ్చి 237 కోట్లతో నాలుగులేన్ల రహదారికి జూపల్లి, వాకిటి, కోమటిరెడ్డి ఈ ఏడాది జూలై 13న శంకుస్థాపన చేశారు. కానీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. హ్యామ్‌ రోడ్ల కింద ఈ పనులు చేపట్టడంతోనే ప్రస్తుత రోడ్డుకు రిపేర్లు చేయడంలేదని తెలుస్తోంది.

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన హ్యామ్‌ రోడ్ల పనుల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. రోడ్లు-భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడల్‌ (హ్యామ్‌) కింద నిర్మించదలచిన రోడ్లకు శంకుస్థాపనలు చేసినా.. పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న పలు రోడ్లను హ్యామ్‌ జాబితాలో చేర్చడంతో.. ఆ రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయడంలేదు. దీంతో ఇటు కొత్త రోడ్లు వేయక, అటు ఉన్న రోడ్డుకు మరమ్మతు చేయక.. ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హ్యామ్‌ రోడ్ల విధానాన్ని 2025 జనవరి చివరిలో ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. హ్యామ్‌ కింద నిర్మించే రోడ్లు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఒక ప్రణాళిక రూపొందించారు. 2026 ఏప్రిల్‌-మేలో రోడ్ల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించారు. జూన్‌ 28న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా కనగల్‌లో పైలాన్‌ ఆవిష్కరణతోపాటు హ్యామ్‌ రోడ్ల పనులను ప్రారంభించారు. అయితే ఇది జరిగి నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకూ ఒక్క కిలోమీటరు రోడ్డును కూడా నిర్మించలేదు.


హడ్కో రుణం ఇస్తానన్నా..

రాష్ట్రవ్యాప్తంగా 441 రహదారులను రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో హ్యామ్‌ విధానంలో నిర్మించాలన్నది రోడ్లు, భవనాల శాఖ లక్ష్యం. వీటిని 34 ప్యాకేజీల్లో 6,092.37 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా రోడ్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఏడాది జూలై 28న హ్యామ్‌ పనులకు శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు ఒక్క పని కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలో నిర్మించాలనుకున్న హ్యామ్‌ రోడ్లకు నిధుల సమీకరణ కోసం ఆ శాఖ పలు ప్రయత్నాలు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద చెల్లించేందుకు కావాల్సిన నిధుల్లో రూ.9,161 కోట్ల రుణం కోసం ప్రయత్నించగా.. ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు హడ్కో ముందుకువచ్చింది. ప్రభుత్వ గ్యారంటీతో రుణం ఇచ్చేందుకు సుముఖత తెలుపుతూ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ)కి లేఖ రాసింది.


రూ.9,161 కోట్ల రుణంలో ఐదేళ్ల కాలపరిమితికి తిరిగి చెల్లించే మొత్తానికి 8.6 శాతం వడ్డీరేటు, 15 ఏళ్ల కాలపరిమితి కింద చెల్లించే మొత్తానికి 9.1 శాతం వడ్డీరేటు ఉంటుందని తెలుపుతూ అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు హడ్కో.. ఆర్‌డీసీ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. కానీ, ఐదేళ్లు, 15 ఏళ్ల వ్యవధి కాకుండా మొత్తం నిధులకు వడ్డీరేటును 8.6 శాతం చొప్పునే చెల్లించే అవకాశం కల్పించాల్సిందిగా హడ్కోను కోరాలని ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి, ఆర్‌డీసీకి సూచించినట్టు సమాచారం. దీనిపై ఆర్‌డీసీ.. హడ్కోకు లేఖ రాసినా ఇంతవరకూ సమాధానం రాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద ఇచ్చేందుకు నిధులు లేక ఆర్‌అండ్‌బీ పరిధిలోని హ్యామ్‌ రోడ్ల పనులు నిలిచిపోయాయి.


రోడ్ల అభివృద్ధికి నిధుల సమస్య..

రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రంనుంచి జిల్లాలకు, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, గ్రా మీణ ప్రాంతాల అనుసంధానాలు బలోపేతమవుతాయి. అందుకోసమే ప్రభుత్వం హ్యామ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి ముందుగానే ప్రభుత్వం హ్యామ్‌ రోడ్ల పనులు దక్కించుకు న్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 40 శాతం వాటా నిధులను మొబిలైజేషన్‌ కింద సమకూర్చేందుకు, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్లు సమీకరించుకునేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసింది. ఈ 60 శాతం నిధులను పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లే బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. కాంట్రాక్టర్లు తీసుకున్న రుణాలు, వారికి చెల్లించే నిధుల విషయంలో ఇబ్బందుల్లేకుండా 15 ఏళ్ల కాలంలో చెల్లించేలా ప్రభు త్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసినా నిధుల విషయంలో సమస్య తలెత్తడంతో పనుల్లో ఆటంకం ఏర్పడింది.


దెబ్బతిన్న రోడ్ల నిర్వహణకూ ఇబ్బంది..

రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 6,092.37 కిలోమీటర్ల మేర రోడ్లను హ్యామ్‌ కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయమే ప్రస్తుతం దెబ్బతిన్న రోడ్ల నిర్వహణకు శాపంగా మారింది. సాధారణంగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఎప్పటికప్పుడు రోడ్ల నిర్వహణ చేపడతారు. రాషవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, పాచ్‌వర్కులు, కొత్తగా నిర్మించాల్సి న రోడ్ల జాబితాలను సిద్ధం చేసి, వాటి ప్రకారం రోడ్ల పనులు చేస్తుంటారు. ఈసారి మాత్రం అసలు రోడ్ల నిర్వహణకు సంబంధించిన జాబితాలనే సిద్ధంచేయలేదు. ఇందుకు హ్యామ్‌ విధానమే కారణమని చెబుతున్నారు. హ్యామ్‌ కింద రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, రెండు వరుసల రోడ్లను ఉన్నతీకరించడం, కొన్నిచోట్ల కొత్తగా రోడ్లను నిర్మించడం వంటి పనులు చేస్తారు. అయితే హ్యామ్‌ పరిధిలో ఉన్నాయన్న కారణంగా.. చాలా రోడ్లు దెబ్బతిన్నప్పటికీ వాటికి మరమ్మతు చే యడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పనుల కోసం రూ.490 కోట్లు అవసరమని అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు. కానీ, ఇంతవరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.


హ్యామ్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ పనులు..

రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని కొన్ని రోడ్లను హ్యామ్‌ జాబితాలో పెట్టారు. వాస్తవానికి ఆ రోడ్లను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా విస్తరించాలని, కొన్నిచోట్ల కొత్త రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. మంజూరైన హ్యామ్‌ పనుల్లో అత్యధికం గా రూ.1649.19 కోట్లతో నల్లగొండ ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్యాకేజీలుగా 52 రోడ్లను (706.65 కిలోమీటర్ల) ప్రతిపాదించారు.

హ్యామ్‌ కింద ఆర్‌అండ్‌బీ పరిధిలో చేపట్టిన రోడ్ల వివరాలు..

జిల్లా

ప్యాకేజీలు

రోడ్లు

నిధులు (రూ.కోట్లలో)

ఆదిలాబాద్‌

02

18

571.69

భద్రాద్రి కొత్తగూడెం

01

10

380.90

హనుమకొండ

03

48

1,289.06

జగిత్యాల

03

32

653.77

భూపాలపల్లి

01

11

364.52

కరీంనగర్‌

01

20

346.87

ఖమ్మం

03

38

1,230.56

మహబూబ్‌నగర్‌

02

26

912.67

మంచిర్యాల

02

13

594.62

నల్లగొండ

04

52

1,649.19

నిజామాబాద్‌

02

30

656.02

హైదరాబాద్‌

02

29

752.96

సంగారెడ్డి

03

44

1,590.87

సిద్ధిపేట

01

26

451.68

వనపర్తి

02

26

863.12

భువనగిరి

02

18

697.77

34

441

13,006.27


ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 04:09 AM