పెట్టుబడులకు రెట్టింపు లాభాలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:42 AM
ఆయుధ ఎగుమతులు, రక్షణ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలనేది తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారాలని చెప్పారు.
రక్షణ పెట్టుబడులు రెండింతలు చేయండి
ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా ఇస్తా
త్వరలో రక్షణ, ఏరోస్పేస్ 2.0 పాలసీ
జీడీపీలో తెలంగాణ వాటా డబుల్ కావాలి
అందుకు రక్షణ పెట్టుబడులే కీలకం
ఎగుమతుల్లో దేశం నంబర్ 1 కావాలి
అందులో తెలంగాణ ముందుండాలి
ఆయుధ బలంతోనే దేశానికి శాంతి
రక్షణ ఎక్స్‌పోలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆయుధ ఎగుమతులు, రక్షణ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలనేది తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారాలని చెప్పారు. యుద్ధానికి అవరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి దేశం ఎదగాలన్నారు. శనివారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలె్‌సలో జరిగిన ‘రక్ష ఎక్స్‌పో-2026’ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం కీలకోపన్యాసం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రక్షణ పెట్టుబడుల కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, కార్మిక మంత్రి జి.వివేక్, మాజీ ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ రామ్‌చౌదరి, 90 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆయుధాలు యుద్ధం కోసమే కాకుండా శాంతిని కాపాడేందుకు అవసరమని చె ప్పారు. శత్రువులు యుద్ధానికి దిగకుండా నిరోధించే శక్తి ఆయుధాలతోనే లభిస్తుందన్నారు. రక్షణ ఉత్పత్తుల్లో స్వయంస్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సాకారం చేయడానికి తెలంగాణ ఇప్పటికే తనవంతు కృషి చేస్తోందని చెప్పారు. దీన్ని పారిశ్రామికరంగం అందిపుచ్చుకోవాలని సూ చించారు. రక్షణ రంగంతో పాటు స్పేస్, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేధ, డ్రోన్ టెక్నాలజీ వంటి అనుబంధ రంగాల్లో ఈ సమావేశానికి హాజరైన వారంతా కృషి చేసి, భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలని కోరారు. తెలంగాణలో రక్షణ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వేసుకున్న ప్రణాళికలను రెట్టింపు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సహకరించడంతో పాటు వారు వేసుకున్న లాభాల అంచనాలను కూడా రెట్టింపు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అడగాలని, సహకరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి గురించి తనకు స్పష్టమైన దార్శనికత ఉందన్నారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. అందుకే, తెలంగాణ రైజింగ్ విజన్-2047 పత్రాన్ని విడుదల చేశామని చెప్పారు. దేశ జనాభాలో ప్రస్తు తం తెలంగాణ వాటా 2.5శాతమని, జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతమని వెల్లడించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. తమ జీడీపీ లక్ష్యాలను చేరుకోవడంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, వాటి అనుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరిజనల్ ఎక్వి్‌పమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్(ఓఈఎం), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఒకే వేదికపై కలుసుకోవడానికి రక్ష ఎక్స్‌పో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల ప్రతినిధులు, ఉన్నత స్థాయి రక్షణ దళాల అధికారులు, భద్రతారంగ అధికారులు, నిపుణులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని తీసుకురావాలని ఆశించారు.
రాష్ట్రంలో పాలసీ పెరాలిసిస్ లేదు
రాజకీయంగా, సైద్ధాంతికంగా రాష్ట్రంలోని పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నా పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చా రు. 1994 నుంచి ఇప్పటివరకు మూడు దశాబ్దాల కాలంలో మూడు పార్టీల ప్రభుత్వాలు వచ్చినా రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలనే ప్రభుత్వాలు అమలుచేస్తూ వచ్చాయని చెప్పారు. పెట్టుబడులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అన్వయం చేసుకొని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం రక్షణ 2.0 పాలసీని, ఏరోస్పేస్ పాలసీని ప్రకటించబోతోందని చెప్పారు. దేశంలో హైదరాబాద్ అత్యంత వ్యూహాత్మక నగరమని, పరిశోధన రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ 108 దేశాల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించామని ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడే లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటవుతోందని చెప్పారు.
హైదరాబాద్ అత్యంత సురక్షిత మైన నగరమని, భారత సైన్యానికి, వైమానిక దళాలకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన నగరం అని ప్రస్తావించారు. డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్, బీడీఎల్, మిధాని, టాటా, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు మన మధ్య ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల వారు అప్రెంటి్‌సషిప్ విధానం అమలు చేయాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్ రంగ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 2023-24లో రక్షణ రంగ, ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.15,900 కోట్లుగా ఉంటే... 2025-26లో రూ.32,850 కోట్లకు చేరాయని చెప్పారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో 40-50 ఏళ్లుగా ఉందని శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగాలు 70 దశకంలో ప్రారంభమయ్యాయని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో డిఫెన్స్, ఏరోస్పేస్, నిర్మాణ రంగం సహా 33 విభాగాల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. రూ.2400 కోట్లతో ఐటీఐలను ఆఽధునికీకరిస్తున్నామని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల కాలానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ రీజినల్ రింగురోడ్డును నిర్మించనున్నామన్నారు. భారత్ రక్షణ, ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు తెలిపారు. 30 శాతం రక్షణ, ఏరోస్పేస్ రంగ పరిశ్రమలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. డీఆర్‌డీఎల్, డీఆర్‌డీవోతో పాటు 2014లో 200 యూనిట్లు ఉంటే ప్రస్తుతం 2 వేల యూనిట్లు చేరాయని వివరించారు. చంద్రయాన్, మంగళ్‌యాన్‌లకు ఉపకరణాలను హైదరాబాదే అందించిందని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News