తుమ్మిడిహెట్టిపై రేపు మహా చర్చలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:27 AM
ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తుతో తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర వెళుతున్నారు.
ముంబైలో ఫడణవీస్‌తో సీఎం రేవంత్ భేటీ..
వెంట నీటి పారుదల మంత్రి ఉత్తమ్
152 మీటర్ల ఎత్తుకు సమ్మతి కోరనున్న తెలంగాణ
150 మీటర్లకయినా ఒప్పించాలని యోచన
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తుతో తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర వెళుతున్నారు. ఆదివారం రాత్రి ముంబై చేరుకుంటారు. సోమవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ కానున్నారు. సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని ఫడ్నవీస్ సూచనప్రాయంగా తెలియజేశారని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల వెల్లడించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా సహకారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీతో పాటు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లను ముఖ్యమంత్రి పలుమార్లు నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదే విషయమై పలు లేఖలు రాశారు. ఇటీవలే ప్రధాని కార్యాలయం సీఎం విజ్ఞప్తికి స్పందించి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం కూడా నిర్వహించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించి, 76.650 కిలోమీటర్ల మేర గ్రావిటీతో 80 టీఎంసీల జలాలను తరలించడం వల్ల ఏటా రూ.383.50 కోట్ల కరెంట్ బిల్లుల భారం తప్పుతుందని ప్రభుత్వం ఇప్పటికే లెక్క కట్టింది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల 76.65 కిలోమీటర్ల మేర గ్రావిటీతో తరలించి, మరో 20.90 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వి నీటిని వదిలితే 8.25 కిలోమీటర్ల్లు గ్రావిటీతో నీళ్లు వెళ్లి సుందిళ్ల బ్యారేజీలో చేరతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించనున్నారు. తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద వార్థా నదిపై ఒకటి, వెన్‌గంగాపై మరోటిబ్యారేజీ ఒకే కాంప్లెక్స్‌గా కడతారు. లంభాకారంలో బ్యారేజీ నిర్మాణం ఉండనుంది. 152 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా మహారాష్ట్ర గట్టి పట్టు పడితే 150 మీటర్లతో అయినా సమ్మతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
గ్రామాల ముంపు లేకుండా నిర్మాణం
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టినా, లేక 152 మీటర్ల ఎత్తుతో నిర్మించినా గ్రామాలు ముంపునకు గురి కావని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 150 మీటర్ల ఎత్తుతో అయితే 413 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్(మహారాష్ట్ర)లో 382 హెక్టార్ల మేర ముంపునకు గురవుతుందని, తెలంగాణలో 450 హెక్టార్లు మహారాష్ట్రలో 1,256 హెక్టార్లు కలుపుకొని నదీ గర్భం 1,706 హెక్టార్లు ముంపునకు గురవుతుందని వివరిస్తారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1174 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, తెలంగాణలో 556 హెక్టార్లు, మహారాష్ట్రలో 1,600 హెక్టార్లు కలిపి 2,156 హెక్టార్ల నదీ గర్భం ముంపునకు గురవుతుందని, 545 హెక్టార్ల చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్ ముంపునకు గురవుతుందని గుర్తించారు.
1975లో తెరమీదికి ప్రాణహిత
1975 అక్టోబరు 6న ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బీ చవాన్‌తో ప్రాణహిత ప్రాజెక్టుపై ఒక అంగీకారానికి వచ్చారు. రెండు రాష్ట్రాలు కలిసి ప్రాణహితపై బ్యారేజీలు కట్టుకోవాలని 1978 ఆగస్టు 7న ఒప్పందం జరిగింది. 2010 ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సూత్రప్రాయంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సమ్మతి తెలిపింది. 2010 అక్టోబరు 8వ తేదీన 152 మీటర్ల ఎత్తుతో 160 టీఎంసీల జలాలను తరలించేలా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి సమర్పించారు. 2012 మే 5న అంతరాష్ట్ర ఒప్పందం కూడా కుదిరింది. 2013 మే 7వ తేదీన ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు బ్యారేజీ ప్రదేశాన్ని సందర్శించారు. 2024 నవంబరులో కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్ఎస్) నమూనా అధ్యయనాలు చేసి, 2014, 2015లో నివేదికలు సమర్పించింది. ఇక 2016 ఆగస్టు 23వ తేదీన 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కూదా కుదిరింది. ఇవన్నీ మహా సీఎంకు నివేదించి 150 మీటర్ల ఎత్తుతో అయినా సమ్మతి పొందాలని సీఎం భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News