Share News

హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:58 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ హెచ్చరించారు.

హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
BRS Leaders Kaleshwaram Visit

  • కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌

  • కన్నెపల్లి పంప్‌హౌస్‌, మేడిగడ్డ బ్యారేజీని

  • సందర్శించిన బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం

భూపాలపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ హెచ్చరించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌ‌స్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, సీ. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్దకు వెళ్లేందుకు వీరు ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంవతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది.


అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రిటైర్డ్‌ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నా.. సీఎం అనాలోచిత నిర్ణయాలు, అవగాహన రాహిత్యం వల్ల హైదరాబాద్‌ ప్రజలు నీళ్ల కోసం ట్యాంకర్లపై ఆధారపడుతూ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి, జలాశయాలను నింపి హైదరాబాద్‌ దాహార్తిని తీర్చాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ తాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2027 జూన్‌ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి

బంగాళాఖాతంలో తుఫాన్‌!

ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 04:58 AM