Share News

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:37 AM

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లోని ‘సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు (కార్‌) హెడ్‌క్వార్టర్స్‌ విభాగంలో ఒక క్యాంపు క్లర్కు (జూనియర్‌ అసిస్టెంట్‌).. డిపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ ఖాతాలోని సొమ్ముపై కన్నేశాడు..

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
IPS Signature Forgery

  • పోలీస్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి రూ.కోటికిపైగా స్వాహా

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌లోని ‘సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు (కార్‌) హెడ్‌క్వార్టర్స్‌ విభాగంలో ఒక క్యాంపు క్లర్కు (జూనియర్‌ అసిస్టెంట్‌).. డిపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ ఖాతాలోని సొమ్ముపై కన్నేశాడు.. ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్‌ వేశాడు.. ఖాతాలోని అసలు సొమ్మును ముట్టుకోకుండా, దానిపై జమయ్యే వడ్డీని.. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి విత్‌డ్రా చేసుకున్నాడు.. ఆ సొమ్ముతో జల్సాలు చేసి, అడ్డగోలుగా ఖర్చులు పెట్టేసుకున్నాడు.. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.


అరెస్టు చేయడం కంటే ముందు.. పక్కదారి పట్టిన రూ.కోటికిపైగా సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మా రింది. సుమారు రెండేళ్లుగా ఐపీఎస్‌ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, సొమ్ము కొట్టేస్తున్నా.. బయటపడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొంతకాలం ‘కార్‌’ విభాగం నుంచి బదిలీ అయిన సదరు క్యాంపు క్లర్కు ప్రస్తుతం సౌత్‌జోన్‌ ప్రధాన కార్యాలయంలోని ఓ విభాగంలో పనిచేస్తున్నట్టు తెలిసింది.


ఫోర్జరీ సంతకాలతో సొమ్ము విత్‌డ్రా..

పోలీస్‌శాఖలో డబ్బులు కొట్టేసేందుకు నిందితుడు తెలివైన పన్నాగం పన్నినట్లు తెలిసింది. సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విభాగం బ్యాంకు ఖాతాలో సిబ్బంది వెల్ఫేర్‌, ఇతర మౌలిక వసతులు, సదుపాయాల కోసం రూ.కోట్లలో డబ్బులు నిల్వ ఉంటాయి. ఆ మొత్తంపై బ్యాంకుల నుంచి వడ్డీ జమ అవుతూ ఉంటుంది. అలా వడ్డీ రూపంలో ఎంత మొత్తం, ఎప్పుడు జమ అవుతుందనే దానిపై సదరు సీసీకి పూర్తి అవగాహన ఉంది. వడ్డీ డబ్బులు జమ కాగానే సిబ్బంది వెల్ఫేర్‌ కోసం డబ్బులు విత్‌డ్రా చేసిన తరహాలో.. ఫోర్జరీ చెక్కులతో వడ్డీ సొమ్మును విత్‌డ్రా చేసుకునేవాడు.


ఖాతాలో నిల్వ సొమ్ములో మార్పు లేకపోవడంతో ఎవరికీ పెద్దగా అనుమానం వచ్చేది కాదు. ఇలా కొన్నేళ్లుగా ఐపీఎస్‌ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, చెక్కుల ద్వారా డబ్బులు కాజేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్టు సమాచారం. ఇక ఇంత పెద్ద ఎత్తు న డబ్బులు డ్రా అవుతున్నా.. అటు ఉన్నతాధికారులకు గానీ, చెక్కులపై సంతకాల విషయంలో బ్యాంకు అధికారులకు గానీ ఎలాంటి అనుమా నం రాకపోవడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, అధికారుల పాత్ర ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

జీసీసీని ముంచిన వాళ్లను శిక్షించాలి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 05:37 AM