Share News

‘తుమ్మిడిహెట్టి’కి ఎలాగైనా ఒప్పిద్దాం

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:34 AM

ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల పథకానికి గుండెకాయలాంటి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

‘తుమ్మిడిహెట్టి’కి ఎలాగైనా ఒప్పిద్దాం
Revanth Reddy, Devendra Fadnavis

  • నేడు తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ

  • ముంబైలో ఉదయం11 గంటలకు సమావేశం..

  • బ్యారేజీ ఎత్తు, భూసేకరణపై చర్చించనున్న రేవంత్‌, ఫడణవీస్‌

  • ఆదివారం రాత్రే ముంబైకి బయలుదేరి వెళ్లిన రేవంత్‌రెడ్డి

  • +152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని పట్టుదలగా ఉన్న సీఎం

  • అందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించాలని కృతనిశ్చయం

  • భేటీలో పాల్గొననున్న ఇరు రాష్ట్రాల సాగునీటిశాఖల మంత్రులు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల పథకానికి గుండెకాయలాంటి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. +152 మీటర్ల ఎత్తులో ఈ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం రాబట్టేందుకు నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశం అవుతున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో ఉదయం 11గంటలకు ఇద్దరు సీఎంలు సమావేశమవుతారు. ఈ సమావేశం కోసం రేవంత్‌రెడ్డి ఆదివారం రాత్రే ముంబైకి బయలుదేరి వెళ్లారు.


ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతోపాటు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు కూడా పాల్గొంటారు. బ్యారేజీ నిర్మాణం, ఎత్తు, భూ సేకరణ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కనపెట్టిన ఈ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేసి తీరాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. 2023లో సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచే ఆయన దీనిపై దృష్టిపెట్టారు.


తుమ్మిడిహెట్టి కోసం పట్టువదలక ప్రయత్నాలు

డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ కీలకమైనది. గతంలో ఒప్పందాల దశలోనే ఆగిపోయిన ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు సీఎం రేవంత్‌ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 2016 ఆగస్టు 23న అప్పటి తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నీటి మట్టాన్ని +148 మీటర్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తెచ్చి తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టింది. దీంతో ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు ఆశించిన స్థాయిలో సాగు, తాగునీరు అందలేదు.


రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక +152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారు. గత ఏప్రిల్‌ 9న నిర్వహించిన సమీక్షలో బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదింపులు ప్రారంభించాలని కోరారు. మే 6న బ్యారేజీపై చర్చలకు సమయమివ్వాలని మహారాష్ట్ర సీఎంకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. మే 26న ఫడణవీ్‌సకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై స్వయంగా లేఖ రాశారు. మహారాష్ట్రతో ఉన్న పెండింగ్‌ అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జూన్‌ 11న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా లేఖ రాశారు. ఆ లేఖను ప్రధాని కార్యాలయం కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపింది. ఆగస్టు 5న సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌లు ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు.


+148 మీటర్ల ఎత్తు వద్ద గ్రావిటీ ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యంకాదని, +150 నుంచి +152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించి విద్యుత్‌ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపారు. దీంతో కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, అనంతరం రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖల మంత్రులతో భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1న కేంద్ర జలసంఘం చైర్మన్‌ అధ్యక్షతన అంతర్‌రాష్ట్ర సమావేశం నిర్వహించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్‌రాష్ట్ర అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ పుణె నిర్వహించిన బ్యాక్‌ వాటర్‌ అధ్యయనాలను తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరు 3న మహారాష్ట్ర జల వనరుల శాఖకు పంపించింది. +148 నుంచి +152 మీటర్ల వరకు వివిధ నీటి మట్టాల్లో ముంపు ప్రభావాన్ని చూపించే కాంటూర్‌ మ్యాపులను అందజేసింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సీఎంల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

పెండింగ్‌ ఎన్నాళ్లు?

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:34 AM