Share News

14 మంది మిల్లర్ల అరెస్టు

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:53 AM

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చేయాల్సిన సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి ములుగు, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని 16 మిల్లుల్లో సోదాలు నిర్వహించి 14చోట్ల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు.

14 మంది మిల్లర్ల అరెస్టు
Telangana rice scam

  • ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో భారీగా అక్రమాలు

  • సన్న బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకొని ఆ స్థానంలో దొడ్డు బియ్యం

  • కరీంనగర్‌, నిజామాబాద్‌, ములుగు జిల్లాల్లోని 16 చోట్ల సీఐడీ తనిఖీలు

  • 3,385 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా.. 14 మిల్లుల్లో అక్రమాలు

హైదరాబాద్‌, నిజామాబాద్‌, ములుగు, కరీంనగర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు చేయాల్సిన సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి ములుగు, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని 16 మిల్లుల్లో సోదాలు నిర్వహించి 14చోట్ల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. 2025-26లో నాణ్యమైన సన్న బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని.. ఆ స్థానంలో తక్కువ ధర గల దొడ్డు బియాన్ని సరఫరా చేసినట్లు గుర్తించారు. వేర్వేరుగా 3 కేసులు నమోదు చేసి 14 మంది మిల్లర్లను అరెస్టు చేసినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామునే మిల్లుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.


బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పౌరసరఫరాల శాఖ సేకరణ విభాగం జనరల్‌ మేనేజర్‌ శనివారం సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 2025- 26లో రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం 71.86లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని మిల్లు ఆడించి ఎఫ్‌సీఐకి 59.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు సరఫరా చేయాల్సిందని లెక్క గట్టారు. ఈ క్రమంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌(ఈటీఎఫ్‌) బృందాలు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మిల్లర్లు సరఫరా చేసిన బియ్యాన్ని ల్యాబ్‌లలో పరీక్షించి ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారం కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే దిగా ఉండటంతో ఉన్నతాధికారులు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలొచ్చాయి. అనంతరం తనిఖీల్లో తేలిన అంశాలను ఉన్నతాధికారులు ఫిర్యాదు రూపంలో సీఐడీ అధికారులకు అందజేశారు. రంగం లోకి దిగిన సీఐడీ అధికారులు 14 మిల్లుల్లో కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా 3,385.820 మెట్రిక్‌ టన్నుల దొడ్డుబియ్యాన్ని సరఫరా చేసినట్లు గుర్తించారు.


దీనివల్ల బోనస్‌ రూపంలో ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం కలిగిందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. మరోవైపు.. ఈ అక్రమాలను గుర్తించాక కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం కేటాయించిన 45,414.833 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు నిలిపివేశారు. ఆ రకంగా ప్రభుత్వానికి రూ.242 కోట్ల మేర నష్టాన్ని నిలువరించారు. ఈ అక్రమాల్లో అధికారుల పాత్ర, ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని చారుసిన్హా తెలిపారు. కాగా సీబీఐ అధికారులు అరెస్టు చేసిన 14 మంది మిలర్లలో ములుగు జిల్లాకు చెందిన ఏడుగురు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. అయితే ములుగు జిల్లాలో రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగిన రోజే ఈ అరెస్టులు జరిగాయి.


అరెస్టయిన వారిలో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న బాదం ప్రవీణ్‌ కూడా ఉన్నారు. సీఐడీ అధికారులు ఆ ఏడుగురు మిలర్లను సంఘం కార్యాలయానికి తీసుకొచ్చి ఓటు వేయించాక వెంట తీసుకెళ్లారు. అరెస్టయిన మిలర్లలో నిజామాబాద్‌ శివారులోని పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీ్‌సకు చెందిన లాల్‌శెట్టి గంగాప్రసాద్‌, వేంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని పొట్ల అంజయ్య, శ్రీనివాస్‌ ట్రేడింగ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని బొందుగుల దేవేందర్‌, మాస్టర్‌ బీహెచ్‌యూడీఐ ఆగ్రో ఫుడ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన లాల్‌శెట్టి శ్రీకాంత్‌, హుజూరాబాద్‌ దమ్మక్కపేటలోని వరలక్ష్మి ఇండస్ట్రీస్‌ యజమాని కల్లూరు కృష్ణమూర్తి, జమ్మికుంట అన్నపూర్ణ ట్రేడర్స్‌ యజమాని బల్ల మల్లికార్జున్‌, లక్ష్మీసాయి ఇండస్ట్రీస్‌ యజమాని యాంసాని సంపత్‌ కుమార్‌, కారుణ్య ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని లెంకలపల్లి మధుసూదన్‌, ఇతర మిల్లర్లయిన అక్కుల రఘోత్తం, ఎనగందుల మోహన్‌, లంకె పోతరాజు, బాదం అనిల్‌, మల్యాల ప్రవీణ్‌, ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దుమ్ముగూడెం ఎత్తు పెంపు

‘తుమ్మిడిహెట్టి’కి ఎలాగైనా ఒప్పిద్దాం

తరుముకొస్తున్న తుఫాను

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:53 AM