ఎల్‌నినోతో కఠినమైన కరువు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:38 AM
ఎల్‌నినో.. ప్రకృతి విపత్తు కారణంగా వచ్చింది కఠినమైన కరువని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
పక్కా ప్రణాళికతో ప్రజలను కాపాడతాం
సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేసే వరకు పోరాటం
నవంబరు 1న ఢిల్లీలో 20 లక్షల మందితో భారీ నిరసన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చుంచుపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో.. ప్రకృతి విపత్తు కారణంగా వచ్చింది కఠినమైన కరువని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, శక్తియుక్తులతో ఎదుర్కొని ప్రజలను కాపాడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో దేశంలోనే అత్యధికంగా పంటలు తెలంగాణలోనే పండాయన్నారు.
ప్రస్తుతం ఈ ఏడాది మొదటి పంట పూర్తయిందని.. రెండో పంటకు ఎల్‌నినో ప్రభావంతో నీటి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఈ ఏడాది రెండో పంట వేయొద్దని రైతులను కోరారు. సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం శీతాకాలంలో ఉన్నా వేసవి మాదిరిగా ఎండలు విజృంభిస్తున్నాయని, భూగర్భ జలమట్టాల శాతం తగ్గిందని.. విద్యుత్ వినియోగం పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇకనైనా ప్రతీ రూపాయి తప్పకుండా ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
కాగా ‘సర్’లో సుమారు 13 కోట్ల ఓట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నవంబరు 1న ఢిల్లీలో 20 లక్షలమందితో జరిగే నిరసన, ధర్నా కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 20వేల మంది కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనను కఠినంగా శిక్షించాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో ఢిల్లీకి బయలు దేరుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఇంకా 12 రోజులే మిగిలి ఉన్నందు వల్ల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు గ్రాడ్యుయేట్‌ల వద్దకు వెళ్లి ఓటు నమోదు చేయాలని కోరారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రతినిధి వేగి వెంకటేష్, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News