Share News

కేటీఆర్‌.. నీ దొంగ ఏడుపులు చాలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:48 AM

‘కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర నుంచి గోదావరి నీళ్లు కిందకు అన్యాయంగా పోతున్నాయంటూ కేటీఆర్‌ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఆయన దొంగ ఏడుపులు చాలు. ఆ నీళ్లు ఎక్కడికీ పోవు..

కేటీఆర్‌.. నీ దొంగ ఏడుపులు చాలు
Adi Srinivas

  • ఆ నీళ్లు ఏపీకి పోవు.. దేవాదులలోనే ఎత్తిపోస్తున్నాం..

  • దిగువన సీతారామ ద్వారా ఒడిసిపడుతున్నాం

  • ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకో: ఆది శ్రీనివాస్‌

  • కేటీఆర్‌వి మతి లేని మాటలు: విజయ రమణారావు

  • ఆయన్ను రైతులెవరూ నమ్మే పరిస్థితి లేదు

  • మేడిగడ్డ వద్ద పంపులు నడిపేంత నీటి మట్టం

  • ఉందో లేదో.. కేటీఆర్‌కూ తెలుసు: మేడిపల్లి సత్యం

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర నుంచి గోదావరి నీళ్లు కిందకు అన్యాయంగా పోతున్నాయంటూ కేటీఆర్‌ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఆయన దొంగ ఏడుపులు చాలు. ఆ నీళ్లు ఎక్కడికీ పోవు. తెలంగాణ అవసరాల కోసమే వాడుతున్నాం. దేవాదులలో నీళ్లను నిరంతరం ఎత్తిపోస్తున్నాం. తర్వాత కింద ఉన్న సీతారామ ఎత్తిపోతలతో నీటిని ఒడిసిపడుతున్నాం. తెలంగాణ నుంచి వెళ్లే గోదావరి నీటిని ప్రభుత్వం సంపూర్ణంగా వాడుకుంటోంది’ అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. కమీషన్లకు కక్కుర్తి పడి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించి కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం నుంచి వెళ్లిపోయిన నీళ్లన్నీ ఏపీకే పోతున్నాయని కేటీఆర్‌, ఆయన భజన బృందం తప్పుడు ప్రచారం చేస్తోందని.. అది మానుకుంటే మంచిదన్నారు. ‘కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తి పోయాలని కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు.


మేడిగడ్డ కుంగిన విషయం ఈ సన్నాసులకు తెలియదా? దీనిపై ఇప్పటివరకు ప్రజలకు క్షమాపణ కూడా చెప్పలేదు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నింపితే కొట్టుకుపోవడం ఖాయమని ఎన్డీఎ్‌సఏ ఇచ్చిన నివేదిక కేటీఆర్‌కు కనిపించడం లేదా? అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ వచ్చింది. అక్కడ నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. అయినా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు?’ అంటూ నిలదీశారు. కేటీఆర్‌ గడ్డం పెంచితే సరిపోదని, బుర్రలో మెదడు కూడా ఉండాలన్నారు. కాళేశ్వరం ఎప్పుడైతే కూలేశ్వరం అయిందో, ఆ నాడే కల్వకుంట్ల కుటుంబం ఖతమైపోయిందని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర 20 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని, అవి నేరుగా ఏపీకి పోతున్నాయని కేటీఆర్‌ దిమాక్‌ లేని మాటలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ధ్వజమెత్తారు.


ఆ నీళ్లు దేవాదుల, సీతారామసాగర్‌ల ద్వారా ఎత్తిపోస్తున్నామని చెప్పారు. ఇది తెలిసి కూడా సిగ్గు లేకుండా కేటీఆర్‌.. తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ ప్రకటనలో మండిపడ్డారు. కేటీఆర్‌ మాటలు రైతులు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపితే ఉండవని.. వాటిని రీడిజైన్‌ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఏనాడైనా చుక్క నీరు ఇచ్చారా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి, కేసీఆర్‌ ఫాం హౌస్‌కు నీళ్లు తెచ్చుకోవడం కోసమే కాళేశ్వరం నిర్మించారని దుయ్యబట్టారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం రూ.11 వేల కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, మరో రూ.20 వేల కోట్లు ఖర్చుపెట్టి తుమ్మిడిహెట్టి పూర్తి చేసి ఉంటే చేవెళ్ల వరకు నీళ్లు వచ్చేవని వ్యాఖ్యానించారు.


కేటీఆర్‌ది పిచ్చి ప్రచారం..: మేడిపల్లి సత్యం

మేడిగడ్డ వద్ద పంపులు నడిచేంత నీటి మట్టం ఉందా అంటూ కేటీఆర్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. అలాగని గేట్లు మూసి నీటిని నిల్వ చేసే పరిస్థితీ లేదన్నారు. ఇది తెలిసి కూడా కన్నెపల్లి పంప్‌ వద్ద గోదావరి నీళ్లను ప్రభుత్వం ఏపీకి వృథాగా వదిలేస్తోందంటూ కేటీఆర్‌ పిచ్చి ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మేడిగడ్డ దిగువన దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగిస్తున్నది కేటీఆర్‌కు కనిపించట్లేదా అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఆదివారం సాయంత్రం 6 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 17,900 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 85 గేట్లు తెరిచి ఉన్నాయి. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా ఉన్నాయి.


నది ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవహిస్తోంది. గోదావరిలో ప్రవాహం ఉండటం వేరు, ఆ నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన కనీస నీటిమట్టం ఉండటం వేరు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తాలంటే మేడిగడ్డ వద్ద కనీసం +93.50 మీటర్ల నీటిమట్టం అవసరం. కానీ ప్రస్తుతం ఉన్నది +89.20 మీటర్లే. ఆ నీటి మట్టంతో పంపులు నడువవు. ఇది కేటీఆర్‌కు కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఒక్క మేడిగడ్డతో ముగిసే ప్రాజెక్టు కాదని.. కన్నెపల్లి నుంచి ఎత్తిన నీటిని అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాల్సి ఉంటుందన్నారు. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో మరమ్మతులు పూర్తి చేసి భద్రతా అనుమతులు పొందాల్సి ఉందని చెప్పారు. మేడిగడ్డ దాటిన తర్వాత గోదావరి నేరుగా ఏపీలోకి ప్రవేశించబోదని.. భద్రాచలం వరకు తెలంగాణలోనే ప్రవహిస్తుందని వివరించారు. మేడిగడ్డ దిగువన ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం.. అటు తర్వాత కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎల్‌నినోతో కఠినమైన కరువు

చిన్నారి పెళ్లికూతురు కోసం..

చక్కదనంపై లుక్కేయని చుక్క

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:48 AM