Share News

సానుకూలమే, కానీ..

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:50 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కట్టడానికి తెలంగాణ చేసిన విజ్ఙప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు. తమ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకపోతే 148 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తూ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సానుకూలమే, కానీ..
Devendra Fadnavis, Revanth Reddy

  • మా ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకపోతే ‘148 మీటర్ల ఎత్తుపై’ పునఃసమీక్షకు సిద్ధమే

  • బ్యారేజీ ఎత్తు పెంపుపై స్వతంత్ర అధ్యయనం చేస్తాం

  • ఇరు రాష్ట్రాల సీఎ్‌సలు, ముఖ్య కార్యదర్శులతో కమిటీ వేద్దాం

  • బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం తదితరాలపై పరిశీలిద్దాం

  • వాస్తవాలు, అంచనాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుందాం

  • తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ స్పష్టీకరణ

  • తెలంగాణకు సహకరించేందుకు అభ్యంతరం లేదని వెల్లడి

  • ముంబైలో ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు మహారాష్ట్ర, తెలంగాణలకు వారధిగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ

  • ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు సమ్మతించండి: సీఎం రేవంత్‌

  • మహారాష్ట్ర నిబంధనల ప్రకారమే పరిహారం: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కట్టడానికి తెలంగాణ చేసిన విజ్ఙప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు. తమ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకపోతే 148 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తూ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రతిపాదన పట్ల గతంలోనూ మహారాష్ట్ర సానుకూల వైఖరిని కనబరిచిందని గుర్తు చేశారు. బ్యారేజీ ఎత్తుపై ఇప్పుడు తెలంగాణ విజ్ఙప్తిని పరిశీలించేందుకు తాము స్వతంత్రంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్యారేజీ నిర్మాణ స్థలం, వివిధ ఎత్తుల వద్ద ముంపు ప్రభావం, అవసరమైన భూమి విస్తీర్ణం తదితరాలను ఈ అధ్యయనంలో పరిశీలిస్తారని, దానిలో వెల్లడయ్యే అంశాలు, అంచనాలపై తెలంగాణకు అభ్యంతరాలు ఉంటే రెండు రాష్ట్రాల అధికారులు కలిసి, చర్చించి, పరిశీలిస్తారని వివరించారు. అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుందామని, వాస్తవాలు, సాంకేతిక అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు.


తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కట్టడానికి అనుమతులకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముంబైలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌హౌ‌స్‌లో సోమవారం చర్చించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు, ప్రయోజనాలు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫడణవీస్‌ తెలిపారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సరిహద్దులోని ఆదిలాబాద్‌ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని వెల్లడించారు. అయితే, తుది నిర్ణయానికి రావడానికి ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ‘‘సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలి. మహారాష్ట్ర, తమ ప్రజలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు అభ్యంతరం లేదు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకూ ఎలాంటి అభ్యంతరం లేదు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వివరించారు.


స్నేహ, సోదర భావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర గతంలో పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని గుర్తు చేశారు. పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల వనరుల సంఘం అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని, సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈలోపు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడణవీస్‌ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని నిర్దేశించారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. గతంలో అనుమతి ఇచ్చిన తర్వాత ముంపు ప్రాంతం మరింత ఎక్కువగా ఉందని గుర్తించామని, అందుకే, ఈసారి సమగ్ర అధ్యయనం తప్పనిసరి అని చెప్పారు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని, తదుపరి సమావేశాల నిర్వహణ, కాల పరిమితులను నిర్ణయించాలని సూచించారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్దేశించారు.


ఇరు రాష్ట్రాలకూ వారధి ఇది: సీఎం రేవంత్‌

‘‘తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. రెండు రాష్ట్రాలనూ భౌతికంగా అనుసంధానించే వారధిగా నిలుస్తుంది. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుంది. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. విమానాశ్రయంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతోపాటు ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడంలో ఆదిలాబాద్‌ గిరిజనులు, ఆదివాసీల చిరకాల సాగు, తాగునీటి ఆకాంక్షలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ- మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. దేశ రక్షణ, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలపరంగా ఆదిలాబాద్‌ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు.


నీటి పారుదల శాఖ కార్యదర్శులతో ఉమ్మడి కమిటీ

ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో గ్రామాలు ముంపునకు గురికావని, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందనే అంశాలపై అధ్యయనం చేయడానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేద్దామని మహారాష్ట్ర సీఎం ప్రతిపాదించగా తెలంగాణ ప్రతినిధి బృందం అంగీకరించింది. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై అధ్యయనం, తదుపరి కార్యాచరణకు రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేసింది.

మహారాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం: మంత్రి ఉత్తమ్‌

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదని మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.


ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబరు 6న అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్బీ చవాన్‌ మధ్య ఒప్పందం కుదిరిందని, దీనికి కొనసాగింపుగా వివిధ దశల్లో ప్రయత్నాలు జరిగాయని, అయినా, ఆశించిన పురోగతి సాధించలేకపోయామని తెలిపారు. ‘‘2016లో 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టడానికి ఒప్పందం జరిగింది. కానీ, దీనివల్ల తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవు. గ్రావిటీతో నీటిని తరలించలేము. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుంది. అందుకే, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకర ప్రత్యామ్నాయమని వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలపరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ఫడణవీస్‌ జీ.. ఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సుకు రండి

‘హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నాం. సమ్మిట్‌కు రండి’ అని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

సింగరేణిని కాపాడుకోవాలి

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:04 AM