Share News

కాలాపత్తర్‌ బాల్యవివాహం కేసులో నలుగురి అరెస్టు!

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:22 AM

కాలపత్తార్‌ పరిధిలో 17 ఏళ్ల బాలికకు గుట్టుగా పెళ్లి చేసేందుకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో నిందితులు అరెస్టయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై ‘చిన్నారి పెళ్లి కూతురు కోసం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.

కాలాపత్తర్‌ బాల్యవివాహం కేసులో నలుగురి అరెస్టు!
child marriage investigation

  • నిందితుల్లో బాధిత బాలిక తల్లిందండ్రులు కూడా

  • బాధితురాలికి డిగ్రీలో అడ్మిషన్‌ ఇప్పించిన పోలీసులు

  • ఘటన జరిగిన 23రోజుల తర్వాత వివరాల వెల్లడి

  • రూ.50 లక్షలు చేతులు మారాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు

  • నిందితుడు అరబ్‌ షేక్‌ కాదు: డీసీపీ

హైదరాబాద్‌ సిటీ/చాంద్రాయణగుట్ట అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కాలపత్తార్‌ పరిధిలో 17 ఏళ్ల బాలికకు గుట్టుగా పెళ్లి చేసేందుకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో నిందితులు అరెస్టయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై ‘చిన్నారి పెళ్లి కూతురు కోసం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. బాలికను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి దుబాయ్‌ షేక్‌ అని.. ఈ ఘటన వెలుగులోకి రాకుండా చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపించడం తీవ్ర వివాదాస్పదమైంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన పోలీసులు అదేరోజు రంగంలోకి దిగారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి.. నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో బాలిక తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి పోలీసులు డిగ్రీలో అడ్మిషన్‌ ఇప్పించారు. కేసు వివరాలను రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ కేసు వివరాలను వెల్లడించారు.


ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన అరిఫ్‌ అలీ బైగ్‌(48) సౌదీలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్లయి పిల్లలున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో హైదరాబాద్‌లోని మధ్యవర్తులను సంప్రదించి బాలికను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ పెళ్లికి బాలిక తల్లిదండ్రులూ ఒప్పుకొన్నారు. ఈనెల 2న అర్ధరాత్రి బిర్యానీ షా టెక్రీలో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాల్య వివాహంపై సమాచారం అందుకున్న అంగన్‌వాడీ టీచర్‌, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎసై శివ కుమార్‌ రెడ్డి, టాస్క్‌ ఫోర్స్‌ ఎస్సై మహేశ్‌, మహిళా పోలీస్‌ సిబ్బంది.. పెళ్లి వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించి బాలికను రక్షించారు. పెళ్లి కొడుకు ఆరిఫ్‌ ఆలీ బేగ్‌, ఖాజీ (వివాహాన్ని జరిపించే వ్యక్తి)జహంగీర్‌, మధ్యవర్తి షాహీన్‌, బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ బేగ్‌కు నోటీసు ఇచ్చామని, అతడు ఈనెల 9న సౌదీ వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.


బాల్య వివాహ ప్రయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదని.. ఈ విషయాన్ని ప్రధాన నిందితుడితోనే చెప్పిస్తామని డీసీపీ పేర్కొన్నారు. కాగా పెళ్లి కోసం బేగ్‌, బాలికకు షాపింగ్‌ కోసం రూ.2లక్షలు వెచ్చించినట్లు, బాలిక తల్లిదండ్రులకు రూ.5 లక్షలు, మధ్యవర్తులకు రూ.2లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు క్యాబ్‌ డ్రైవర్‌ అయితే ఇంతపెద్ద మొత్తంలో డబ్బు ఎలా వెచ్చించగలడని.. అతడు అరబ్‌షేకేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలికను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన బేగ్‌, అరబ్‌ షేక్‌ కాదని.. అతడు పాతబస్తీకి చెందిన వ్యక్తేనని.. అతడి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉంటున్నారని డీసీపీ తెలిపారు.


రూ.50 లక్షలు తీసుకొని నిందితుడిని వదిలేసినట్లుగా వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న రాత్రే బాలికను రక్షించిన పోలీసులు, ఆ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు ఎందుకు చెప్పలేకపోయారు? ఘటన రోజే అందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 23 రోజులుగా ఎందుకు అరెస్టు చూపలేదు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు రాచకొండ పరిధిలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పేరుతో అప్పటి సీపీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏడేళ్లలో 100-150 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. రక్షించిన బాలికలను చదవించే ప్రయత్నాలు చేశారు. అయితే పాతబస్తీలో మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని చెప్తున్న పోలీసులు.. బాల్యవివాహాలపై ఎందుకు చైతన్యం కలిగించడంలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

సానుకూలమే, కానీ..

రాష్ట్ర హైకోర్టుకు కొత్త చీఫ్‌ జస్టిస్‌

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:22 AM