Share News

చస్తేనే నిధులిస్తామంటే చచ్చిపోతా..!

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:35 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులకు తాను చస్తేనే నిధులిస్తామంటే చావడానికైనా సిద్ధమని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రకటించారు.

చస్తేనే నిధులిస్తామంటే చచ్చిపోతా..!
Anirudh Reddy

  • నియోజకవర్గానికి నిధులు సాధించేందుకు చావడానికైనా సిద్ధమే

  • నాగర్‌ కర్నూలు కాంట్రాక్టర్‌ చనిపోయాకే రూ.5 కోట్ల నిధులిచ్చారు

  • నిధులివ్వకపోతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

  • నేను చావాలో, బతకాలో ప్రభుత్వమే నిర్ణయించాలి

  • ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులకు తాను చస్తేనే నిధులిస్తామంటే చావడానికైనా సిద్ధమని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి నిధులు సాధించేందుకు చావడానికైనా సిద్ధమేనన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లాలో ఓ ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్‌ చనిపోయాకే రూ.5 కోట్ల బిల్లులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తనకు కూడా చనిపోయాకే ఇవ్వాలని, నియోజకవర్గంలో రూ.40 కోట్ల బకాయిల విషయం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్‌ మండలం కల్లెపల్లిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వస్తున్నాయని, మరి రాష్ట్రంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.


జడ్చర్ల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని, లేకపోతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్షలోనే చనిపోతానని, తాను బతకాలో, చావాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని, అలా కాకుండా కొన్ని నియోజకవర్గాలకే ప్రాధాన్యం దక్కుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటై జడ్చర్ల అభివృద్ధి కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. తనకు రాజకీయాల్లో గురువైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా నిధులు ఇవ్వాలని అడుగుతున్నానని అనిరుధ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’

రాష్ట్ర హైకోర్టుకు కొత్త చీఫ్‌ జస్టిస్‌

కాలాపత్తర్‌ బాల్యవివాహం కేసులో నలుగురి అరెస్టు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:35 AM