Share News

ఇన్ఫోసిస్‌ రెండో క్యాంపస్‌ 30న పోచారంలో ప్రారంభం

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:09 AM

తెలంగాణ ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన రెండో క్యాంప్‌సను అందుబాటులోకి తీసుకురానుంది.

ఇన్ఫోసిస్‌ రెండో క్యాంపస్‌ 30న పోచారంలో ప్రారంభం
Infosys second campus Pocharam

  • హైదరాబాద్‌ ఐటీకి మరో మణిహారం

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన రెండో క్యాంప్‌సను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 30వ తేదీసాయంత్రం పోచారంలోని ఇన్ఫోసిస్‌ ప్రాంగణంలో రెండో క్యాంప్‌సను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కంపెనీ ముఖ్య ప్రతినిధులు పాల్గొంటారని ఇన్ఫోసిస్‌ వర్గాల సమాచారం. తొలుత గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ సమీపంలో ఇన్ఫోసిస్‌ మొదటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పోచారంలోని ఐటీ సెక్టార్‌లో కంపెనీ రెండో ప్రాంగణాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ రెండో ప్రాంగణంలోనే అందుబాటులో ఉన్న భూమిలో రెండో క్యాంప్‌సను నిర్మించారు.


ఈ క్యాంపస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, డిజిటల్‌ సేవలు, అంతర్జాతీయ ఖాతాదారులకు ఐటీ సేవలను అందించనున్నారు. ఈ క్యాంపస్‌ను సుమారు రూ.800-900 కోట్ల వ్యయంతో 4 టవర్లుగా నిర్మించారు. 40 వేల మంది ఉద్యోగులు పనిచేయటానికి వీలుగా దీనిని తీర్చిదిద్దారు. మొదటి దఫాలో ఇందులో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిసింది. ఈ క్యాంప్‌సను పూర్తి ఎకో ఫ్రెండ్లీగా నిర్మించారు. మొత్తం సౌర విద్యుత్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి క్యాంప్‌సలోనూ సోలార్‌ పవర్‌ అందుబాటులో ఉంది. సంస్థకు చెందిన 437 ఎకరాల భూమిలో ఉన్న నీటి కుంటలు, కొన్ని రకాల చెట్లను పెద్దగా తొలగించకుండానే కొత్త భవనాలు నిర్మించారు. దీంతో ఈ ప్రాంగణంలో వడ్రంగి, పాలపిట్టలు సహా కొన్ని రకాల పక్షి జాతులు జీవిస్తున్నాయి. వాటి మనుగడకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కొత్త క్యాంప్‌సకు సంబంధించి కంపెనీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రారంభోత్సవం రోజున దానిని విడుదల చేయనున్నట్లు సమాచారం.


2008లోనే భూ కేటాయింపు..

పోచారంలో ప్రాంగణం ఏర్పాటు కోసం 2008లో 437 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నుంచి ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేసింది. మొదట్లో రూ.1,250 కోట్ల పెట్టుబడితో ప్రాంగణాన్ని ప్రారంభించింది. 2021 నాటికి పెట్టుబడిని రూ.2,500 కోట్లకు పెంచాలని (అదనపు భవనాలు, ఇతర సదుపాయాల అభివృద్ధికి) మొదట్లోనే ప్రణాళికలు రూపొందించారు. మరో 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని 2021లో ప్రభుత్వానికి సంస్థ తెలిపింది. 2025 జనవరిలో దావో‌స్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (దావోస్‌ సదస్సు)లో క్యాంపస్‌ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.


తొలిదశలో రూ.750 కోట్లతో కొత్త భవనాల నిర్మాణంతో పాటు సుమారు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా క్యాంపస్‌ విస్తరణను ప్రకటించింది. దీంతో కంపెనీకి వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నోడల్‌ వ్యవస్థను ఏర్పాటుచేసింది. అవసరమైన అన్ని శాఖల నుంచి సింగిల్‌ విండో విధానంలో నోడల్‌ అధికారులే అనుమతులు సాధించేలా బాధ్యతలు అప్పగించింది. దీంతో రెండో క్యాంపస్‌ నిర్మాణం వేగంగా పూర్తయ్యింది. ఈ క్యాంపస్‌ ప్రారంభంతో ఐటీ రంగంలో హైదరాబాద్‌లో మరిన్ని ఉద్యోగావకాశాలు, అదనపు పెట్టుబడులకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పోచారం, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో ఐటీ కార్యాకలాపాలు పెరగడం వల్ల రవాణా, ఆహార సేవలు, వాణిజ్య కార్యకలాపాలు, ఇతర రంగాలకు డిమాండ్‌ పెరుగుతుందని, ఐటీ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

చలికి గజగజ రాత్రివేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఫతేనగర్‌ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్‌

నేపాలీగ్యాంగ్‌ ఆటకట్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:09 AM