నేపాలీగ్యాంగ్ ఆటకట్టు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:04 AM
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 5 నెలల క్రితం విశ్రాంత డీజీపీ అధికారి రాయ్ వినయ్ రంజన్ నివాసంలో దోపిడీకి పాల్పడటంతో పాటు.. ఆయన భార్య తనూజను హత్య చేసిన నేపాల్ దొంగల ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసును చేధించిన పోలీసులు
మూడు నెలలపాటు కూలీలుగా వేషం మార్చుకొని ప్రత్యేక ఆపరేషన్
ప్రధాన పాత్రధారి పనిమనిషి కల్పన సహా నలుగురి అరెస్టు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
ప్రధాన సూత్రధారి సునీల్‌పై పీడీయాక్టు పెట్టినట్లు వెల్లడి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 5 నెలల క్రితం విశ్రాంత డీజీపీ అధికారి రాయ్ వినయ్ రంజన్ నివాసంలో దోపిడీకి పాల్పడటంతో పాటు.. ఆయన భార్య తనూజను హత్య చేసిన నేపాల్ దొంగల ముఠాను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారి అయిన పనిమనిషి ధర్మ అలియాస్ కల్పనతోపాటు గణేష్ బిశ్వకర్మ, చంద్ర బహదూర్ తమంగ్, గణేష్ బహదూర్ షాహీలను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం ఐసీసీసీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. హత్య జరిగిన పదిరోజులకు ప్రధాన సూత్రధారి అయిన సునీల్ బహదూర్‌తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన దిలీప్ బహదూర్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి26 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అరెస్టయిన వారి నుంచి రూ.51,130 నగదుతో పాటు.. కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాలోని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సజ్జనార్ తెలిపారు. ప్రధాన నిందితుడు సునీల్‌పై పీడీయాక్టు నమోదు చేసినట్టు చెప్పారు. వినయ్‌రంజన్ రాయ్ ఇంట్లో పని మనిషిగా చేరిన కల్పన.. తన ప్రియుడు సునీల్‌తో కలిసి కుట్రపన్ని మే 7న అర్ధరాత్రి ఈ హత్య, దోపిడీకి పాల్పడిందని వెల్లడించారు. తన గ్యాంగుతో కలిసి ఇంట్లో దోపిడీకి పాల్పడుతున్న సమయంలో తనూజ నిద్రలేవటంతో నిందితులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసిన నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. దాంతో ఊపిరి ఆడక తనూజ మృతి చెందింది. నిందితులు ఇంట్లోని 225 గ్రాముల బంగారం తీసుకొని పరారయ్యారు. నాంపల్లి స్టేషన్‌లో రైలు ఎక్కి కాజీపేటలో దిగి దోచేసిన సొత్తును పంచుకొని ఎవరి దారిన వారు పారిపోయారు. పోలీసులు అప్రమత్తమయ్యేలోపు నేపాల్‌కు చేరుకున్నారు.
కూలీల వేషంలో మూడు నెలల ఆపరేషన్
ఈ ముఠాను పట్టుకొనేందుకు సజ్జనార్ మే-19న ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ను ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌లో ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 16 మంది కిందిస్థాయి పోలీసులు ఉన్నారు. ఈ బృందం బెంగళూరు, ముంబై, పుణె, సూరత్, పట్నా, ఢిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్ తదితరప్రాంతాల్లో నిందితుల కోసం విస్తృతంగా గాలించింది. భారత్-నేపాల్ సరిహద్దులో దాదాపు 5 నెలలకు పైగా క్యాంప్ చేశారు. 3 నెలలపాటు కూలీలుగా మారు వేషాలు వేసుకొని అక్కడి మనుషుల్లో కలిసిపోయారు. కొండ ప్రాంతాలు, సుదూర గ్రామాలలో తిరుగుతూ నిందితుల సమాచారం సేకరించారు. దోలాఖా, దైలేఖ్, కైలాలీ జిల్లాల్లో నిందితులు ఉన్నట్టు గుర్తించారు.
ఇదేమీ తెలియని నిందితులు మరోసారి దోపిడీకి పాల్పడేందుకు ఒక్కొక్కరుగా తిరిగి ఇండియాకు చేరుకున్నారు. కల్పన పుణెలోని తన కుమారుడి వద్దకు వెళ్లటంతో ఆమెను పోలీసులు అనుసరించారు. బెంగళూరు, గురుగ్రామ్‌లలో దోపిడీకి ఈ ముఠా పథకం వేసినట్లు గుర్తించి వెంటనే అరెస్టు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలలో 8 దోపిడీ కేసుల్లో నిందితుడైన జీవన్ చంద్ అలియాస్ జిబన్‌ను కూడా సిట్ బృందం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నేపాల్ నుంచి వచ్చి దోపిడీలే లక్ష్యంగా ఇళ్లల్లో పనివారు, వంట మనుషులు, వాచ్‌మెన్లు, కేర్‌టేకర్లుగా చేరుతున్న కొన్ని ముఠాలు.. యజమానులను నమ్మించడానికి నేపాల్ సిటిజన్ కార్డులో ఉన్న పేరును కొద్దిగా మార్చి నకిలీ ఆధార్‌కార్డులు సృష్టిస్తున్నట్లు చెప్పారు. పనిలో చేర్చుకునే ముందు గుర్తింపు కార్డులను తీసుకోవడమే కాకుండా, యూపీఐ లేదా ఇతర మార్గాల ద్వారా వారి అసలు పేరును నిర్థారించుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ 94906 16555కు మెసేజ్ కూడా చేయవచ్చని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చలికి గజగజ రాత్రివేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఫతేనగర్ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్
నా పంట పోతే.. నేనే బాధ్యుణ్ని!
Read Latest AP News And Telangana News And International News And Telugu News