Share News

ఎల్‌నినో మంటలు.. ధరలు భగభగ

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:18 AM

ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు వల్ల వర్షాలు సరిగ్గా కురవక దన్నుగా సరైన తడి లేక పంటల దిగుబడి అరకొరగానే ఉంది. దీంతో ఆహార పంటలైనా.. వాణిజ్య పంటలైనా మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి.

ఎల్‌నినో మంటలు.. ధరలు భగభగ
Telangana crop prices

  • పంటలకు ఆల్‌టైం గరిష్ఠ ధరలు

  • తేజా ఏసీ రకం మిర్చి మెరుపులు..

  • ఖమ్మంలో క్వింటాల్‌ ధర రూ.23,150

  • 3 వారాల్లో రూ.1800 పెరుగుదల

  • మద్దతును మించి ‘మక్క’ల జోరు

  • రూ.2,600లకు క్వింటాల్‌ మక్కలు

  • మానుకోటలో జైశ్రీరాం సరికొత్త గరిష్ఠం

  • క్వింటాల్‌ ధాన్యం రూ.5,550..

  • అదే బాటలో పత్తి, నువ్వుల ధరలు

  • కేసముద్రంలో పసుపు క్వింటాల్‌ ధర రూ.19,253

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు వల్ల వర్షాలు సరిగ్గా కురవక దన్నుగా సరైన తడి లేక పంటల దిగుబడి అరకొరగానే ఉంది. దీంతో ఆహార పంటలైనా.. వాణిజ్య పంటలైనా మార్కెట్‌లో ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటికి మొన్న.. గత శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఆల్‌టైం రికార్డు ధర రూ.5,016 పలికిన అతి సన్నాలు.. పాత జైశ్రీరాం వరి ధాన్యానికి సోమవారం మహబూబాబాద్‌లో ఆల్‌ టైం గరిష్ట ధర రూ.5,550 నమోదు కాగా, కేసముద్రంలో మరో రికార్డు నమోదైంది. తాజాగా సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ‘తేజా రకం ఏసీ’ మిర్చి ధర ఊపందుకుంటే.. మక్క’లకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని మించి మద్ధతు లభించింది. జాతీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న మొక్కజొన్న జోరు పెరిగింది. ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధర పెట్టి మరీ వ్యాపారులు కొంటున్నారు. ప్రస్తుత సంవత్సరం (2026-27)లో క్వింటాల్‌ మొక్కజొన్నకు ఎంఎ్‌సపీ రూ.2,410.


కాగా, సోమవారం క్వింటాల్‌ మక్క ధర రూ.2,600 పలికింది. అసలు గత మూడు నెలలుగా మక్కల ధర దూకుడుగానే ఉంది. ఇక, తేజా రకం ఏసీ మిర్చి క్వింటాల్‌కు జెండాపాట ధర రూ. 23,150లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. 3 వారాల క్రితం ధరలతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.1,800 వరకు పెరిగింది. గత శుక్రవారం తేజా రకం ఏసీ మిర్చి క్వింటాల్‌కు రూ.22,800 ధర ఖరారు చేసిన వ్యాపారులు.. శని, ఆదివారం సెలవుల తర్వాత సోమవారం రూ.600 అదనపు ధర పెంచారు. సాధారణ రకం తేజా మిర్చి (నాన్‌ ఏసీ) నాణ్యతను బట్టి క్వింటాల్‌ ధర రూ.12,000 - రూ. 16,200 మధ్య పలకగా.. నమూనా రకాల మిర్చి క్వింటాల్‌కు ధర రూ. 13,000కు కొన్నారు. మరోవైపు, వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు సోమవారం వచ్చిన కొత్త మిర్చి ‘ధర్మ యూఎస్‌ 341’ క్వింటాల్‌కు రూ.19,011 ధరకు కొనుగోలు చేశారు.


మానుకోటలో రూ.5,550 పలికిన జైశ్రీరాం

మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం వచ్చిన పాత రకం జైశ్రీరాం ధాన్యం క్వింటాల్‌కు ఆల్‌టైం గరిష్ఠ ధర రూ.5,550 పలికింది. మానుకోట శివారు పిల్లిగుండ్ల తండా రైతు భూక్యా పంథ్యా.. మార్కెట్‌కు 14 బస్తాల జైశ్రీరాం వరి ధాన్యం తీసుకొచ్చారు. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటాల్‌ ధాన్యం ధర రూ.4,710 కాగా, మక్కలు క్వింటాల్‌కు రూ.3,011, పత్తి ఽరూ.9,121, నువ్వులు రూ.14 వేలు పలికాయి కేసముద్రంలో జైశ్రీరాం పాతరకం క్వింటాల్‌కు రూ.5,161, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.4,411, మక్కలు రూ.3,106, పత్తి రూ.9,099 ధర రికార్డయ్యాయి. కేసముద్రం మార్కెట్‌కు వచ్చిన పసుపు కాడి రకం క్వింటాల్‌ గరిష్ఠ ధర రూ.19,253, కనిష్ట ధర రూ.15,589 కాగా, గోళరకం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.18,566, కనిష్టంగా రూ.8,506, సగటున రూ.17,469లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నెల 22న క్వింటాల ధర రూ.13,319లకే పరిమితం కావడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇన్ఫోసిస్‌ రెండో క్యాంపస్‌ 30న పోచారంలో ప్రారంభం

యూనివర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల అమలు

నేపాలీగ్యాంగ్‌ ఆటకట్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:18 AM