Share News

మావోయిస్టులకు భారీ దెబ్బ.. 47 మంది లొంగుబాటు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:06 PM

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు.

మావోయిస్టులకు భారీ దెబ్బ.. 47 మంది లొంగుబాటు
Maoist Surrender

హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యులు, అలాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా హేమ్లా ఇతు (అలియాస్ విజ్జా), పోడియం లచ్చు (అలియాస్ మనోజ్) వంటి నాయకులు ఈ జాబితాలో ఉన్నారని డీజీపీ తెలిపారు.


లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు భారీగా ఆయుధాలు కూడా అప్పగించారు. మొత్తం 32 ఆయుధాలు, అలాగే 515 తూటాలు పోలీసులకు సమర్పించినట్లు డీజీపీ వెల్లడించారు. వీటిలో LMG, AK-47, INSAS, SLR రైఫిల్స్‌తో పాటు పిస్టల్స్, రివాల్వర్, మస్కెట్ గన్స్ వంటి వివిధ రకాల ఆయుధాలు ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం కారణంగా ఈ మావోయిస్టు కేడర్లు లొంగుబాటుకు ముందుకొచ్చారని చెప్పారు. దక్షిణ బస్తర్ డివిజన్ ప్రస్తుతం పూర్తిగా నిర్వీర్య స్థితికి చేరిందని కూడా డీజీపీ వ్యాఖ్యానించారు. లొంగిపోయిన వారిలో PLGA బెటాలియన్‌కు చెందిన 4 మంది, DKSZCకు చెందిన 28 మంది, అలాగే 9వ, 30వ ప్లాటూన్‌లకు చెందిన 15 మంది ఉన్నారని వివరించారు.


డీజీపీ విజ్ఞప్తి..

ఇక తెలంగాణకు చెందిన కొంతమంది కీలక మావోయిస్టు నాయకులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వారిలో లక్ష్మణరావు (గణపతి), పసునూరి నరహరి (సంతోషం), జాడి రత్నాభాయ్ (సుజాత), వార్త శేఖర్ (మంగు) ఉన్నారని పేర్కొన్నారు. వీరిని కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణలో భద్రతా బలగాల చర్యలు మరింత ప్రభావం చూపుతున్నాయని డీజీపీ తెలిపారు.


జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసుల సమర్థవంతమైన పనితీరు వల్ల మొత్తం 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన పునరావాస ప్యాకేజీలు, పోలీసులు సాగిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల అడవి బాట పట్టిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ భారీ లొంగుబాటుతో రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 05:17 PM