Share News

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Feb 02 , 2026 | 08:57 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. పీఈసీ జూమ్ సమావేశం, అవార్డు కార్యక్రమం, జిల్లాల పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలతో ఆయన షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చేపడుతున్న ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటనలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపిన సీఎం.. రాష్ట్రానికి వచ్చాక ఇక్కడి రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టారు. ఈరోజు(సోమవారం) నుంచి ఆయన పూర్తిగా బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ వ్యూహ రచన, ఎన్నికల ప్రచారంపై కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పీఈసీ జూమ్ సమావేశం, అవార్డు కార్యక్రమం, జిల్లాల పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చేపడుతున్న ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


జూమ్ మీటింగ్..

ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు జరిగే పీఈసీ జూమ్ సమావేశానికి సీఎం రేవంత్‌ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులు వంటి తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహ రచనపై సీఎం స్వయంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.


మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్..

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా సీఎం భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందిస్తోంది. ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు సీఎం. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయడమే కాకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.


జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు ప్రదానం..

ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు జరిగే రావినారాయణ రెడ్డి మెమోరియల్ అవార్డు ఫంక్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. న్యాయ వ్యవస్థలో చేసిన విశేషసేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

సీఎం జిల్లాల పర్యటన..

సీఎం రేవంత్‌ ఈనెల 4 నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార సభలను షురూ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన, పార్టీ నాయకులకు దిశానిర్దేశం, ఎన్నికల ప్రచారానికి ఊపునిచ్చేలా సీఎం భావిస్తున్నట్లు సమాచారం.


సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్..

  • ఫిబ్రవరి 4వ తేదీ – మిర్యాలగూడ

  • 5వ తేదీ – చొప్పదండి

  • 6వ తేదీ – నిజామాబాద్ రూరల్

  • 7వ తేదీ – పరిగి

  • 8వ తేదీ – భూపాల్‌పల్లి

  • 9వ తేదీ – మెదక్

ఈ సభల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలాన్ని ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి.


రాజకీయంగా సీఎం పర్యటనలు కీలకం..

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు, ప్రచార సభలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు సీఎం స్వయంగా రంగంలోకి దిగడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజాసమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సీఎం ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండటంతో ఈ పర్యటనలకు ప్రాధాన్యం పెరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 10:01 AM