సమ్మక్క సాగర్ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:08 PM
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో (CM Vishnu Deo Sai) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు (మంగళవారం) ఛత్తీస్‌గఢ్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు నీటి అవసరాలు పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
సమ్మక్క సాగర్‌లో నీటి నిల్వకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులపైనా ఛత్తీస్‌గఢ్ సీఎంతో చర్చించారు. ఈ రాష్ట్రంలో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి నిధులు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో 33 ఎకరాల వరకే ముంపు ఉందని అన్నారు. భారీ వరదల సమయంలోనూ 100 ఎకరాలకు ముంపు ప్రాంతం మించలేదని తెలిపారు.
ఇప్పటికే తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని తెలంగాణ సీఎం వెల్లడించారు. అలాగే, 83 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టం వద్ద 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉందని వివరించారు. సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాల వినియోగమే లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News