Share News

నీరు లేక.. బోటింగ్‌ సాగక!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:18 PM

దసరా సెలవుల నేపథ్యంలో గలగలపారే సెలయేరు నడుమ బోటు షికారు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నగరవాసులకు నిరాశే ఎదురవుతోంది.

నీరు లేక.. బోటింగ్‌ సాగక!
Telangana Tourism, Srisailam Boat Tour

  • రాష్ట్రంలో నామమాత్రంగా బోటు షికారు

  • పలు ప్రాంతాల్లో పర్యాటకులకు అందని పడవ ప్రయాణం

  • శ్రీశైలం-నాగార్జునసాగర్‌ మధ్యలో 525 అడుగుల నీటిమట్టం

  • బోటు నడిచేందుకు 565 అడుగులకుపైగా ఉండాలంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: దసరా సెలవుల నేపథ్యంలో గలగలపారే సెలయేరు నడుమ బోటు షికారు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నగరవాసులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు భార్య, పిల్లలు, బంధువులతో కలిసి వెళ్లి లాహిరి లాహిరి లాహిరి.. అంటూ సరదాగా బోటులో తిరిగివద్దామని భావించిన వారికి ఆయా ప్రాంతాల్లోని జలాశయాల్లో తగ్గిన నీటిమట్టాలు ఇంటికే పరిమితం చేస్తున్నాయి. నీటి ప్రవాహం పెరిగిన తర్వాత మాత్రమే బోటు ప్రయాణానికి రావాలని సూచిస్తున్నాయి.


హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌, దుర్గం చెరువు, జూపార్కులోని మీరాలం ట్యాంక్‌, సరూర్‌నగర్‌తోపాటు వరంగల్‌ భద్రకాళి గుడి, రామప్ప, లక్నవరం, కరీంనగర్‌, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, నిజామాబాద్‌, కోహిల్‌సాగర్‌, సోమశిల, తదితర ప్రాంతాల్లో మొత్తం 25 బోటింగ్‌ యూనిట్లు నడుస్తున్నాయి. హుస్సేన్‌సాగర్‌, దుర్గంచెరువు లాంటి యూనిట్లలో ప్రతిరోజు 500-1000 మంది వరకు పర్యాటకులు బోటింగ్‌ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల 500లోపు సందర్శిస్తున్నారు. కాగా, శ్రీశైలం-నాగార్జునసాగర్‌, శ్రీశైలం-సోమశిల లాంటి యాత్రలకు ప్రతిరోజు రెండువైపు 200 మంది వరకు పర్యటిస్తున్నారు.


‘ఎల్‌నినో’తో టూర్లకు బ్రేక్‌..!

ఏటా వర్షాకాలంలో జూలై నుంచి మొదలుకుని జనవరి వరకు తెలంగాణ పర్యాటకశాఖ అధికారులు క్రూయిజ్‌ బోటు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంటారు. ఇందులో కొన్ని హైదరాబాద్‌ నుంచి బస్సు, బోటుతో కలిపి, మరికొన్ని వన్‌వే బోటు యాత్రలను నిర్వహిస్తుంటారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ప్రధాన బోటింగ్‌ యూనిట్ల వద్ద నీటి మట్టాలు తగ్గాయి. దీంతో టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు చాలా చోట్ల టూర్లకు బ్రేక్‌ వేశారు. ఉదాహరణకు శ్రీశైలం-నాగార్జునసాగర్‌ను ప్రతి ఏటా ఆగస్టు నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు ఎక్కువగా నడిపిస్తుంటారు. అప్పుడు రెండు మార్గాల మధ్య నీటి మట్టాలు 565 అడుగులకుపైగా ఉంటుంది. దీంతో పడవ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సాఫీగా సాగుతోంది. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం 525 అడుగులు మాత్రమే ఉండడంతో బోటు టూర్‌ను నిలిపివేశారు.


city7.jpgమళ్లీ వర్షాలు వస్తేనే..!

ఎల్‌నినో ప్రభావం పర్యాటకయాత్రలపై కూడా తీవ్రంగా పడుతుంది. వాస్తవంగా నగర టూరిజంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న బోటింగ్‌ యూనిట్ల ద్వారా తెలంగాణ పర్యాటకశాఖకు ఏటా తగిన ఆదాయం సమకూరుతోంది. ఈసారి నీటిమట్టాలు తగ్గిపోవడంతో ఇబ్బందికరంగా మారింది. రోజువారీ పనిలేని సిబ్బందిని ఇతర చోటకు డిప్యూటేషన్‌ వేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వారు కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తగా మరికొందరిని విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


రాజమండ్రి నుంచి పాపికొండలు యాత్ర..!

గోదావరిలో నీటిమట్టాలు ఎక్కువగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పాపికొండలు యాత్రను కొద్ది రోజులుగా నిర్వహిస్తుంది. అయితే కొన్నేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ టూర్‌ను పట్టించుకోకపోవడంతో పర్యాటకులు పాపికొండలు పర్యటనకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల లాంచీ టూర్‌తోపాటు భద్రాచలం-పాపికొండలు యాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో మూలకుపడినట్లయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 12:18 PM