ఆటో కార్మికులకు గుడ్ న్యూస్.. ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:25 PM
ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇంధనం, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 2: ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదల చేసింది. పెరిగిన ఇంధనం ధరలు, వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్, ఇతర నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆటో డ్రైవర్లకు సముచిత ఆదాయం కల్పించడంతో పాటు ప్రయాణికులపై అధిక భారం పడకుండా ఛార్జీలను సవరించినట్లు వెల్లడించింది.
జీవో ప్రకారం కొత్త ఛార్జీలు:
తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.20 నుంచి రూ.30 వరకు విధించగా.. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 నుంచి రూ.14 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిటెన్షన్ ఛార్జీలను నిమిషానికి 50 పైసల నుంచి 75 పైసలకు పెంచింది. అర్హత ఉన్న ప్రతి లగేజీ ప్యాకేజీపై ఛార్జీని 25 పైసల నుంచి 50 పైసలకు పెంచింది. అయితే.. గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగానే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది.
ఇక.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 1.5 రెట్లు అధిక ఛార్జీలను యథాతథంగా విధించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువునిచ్చింది. అప్పటివరకు ఆటోల్లో పాత, కొత్త ఛార్జీల టారిఫ్ కార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఛార్జీలు 2014 ఫిబ్రవరి 14న జారీ చేసిన G.O.Ms.No.20 ప్రకారం నిర్ణయించినవి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలే తెలంగాణలో ఇప్పటివరకూ కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆటో ఛార్జీలను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. సెంట్రల్ కిచెన్లపై సీఎం రేవంత్ ఆదేశాలివే
కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ.. రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
Read Latest Telangana News And Telugu News