విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. సెంట్రల్ కిచెన్లపై సీఎం రేవంత్ ఆదేశాలివే
ABN , Publish Date - Oct 02 , 2026 | 02:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. సీఎం సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తయ్యేలా చూడాలని.. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభమవ్వాలని స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) ముఖ్యమంత్రిని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు కోసం ఈ సంస్థలు సహకారం అందించనున్నాయి. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును సీఎం చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు అందజేశారు.
అలాగే, వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ అందించారు. నిధులు అందించిన సంస్థల ప్రతినిధులను రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని సూచించారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని తెలిపారు.
బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని సీఎం అన్నారు. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలన్నారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇదని.. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలని వెల్లడించారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలని.. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభమవ్వాలని ఆదేశించారు. సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
‘కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోలేదు’.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Read Latest Telangana News And Telugu News