Share News

నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:55 AM

నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెం వద్ద 50 ఏళ్లుగా ఉన్న వంతెన సమస్య ఎట్టకేలకు తీరింది. దాదాపు రూ.6.54కోట్లతో కలుజుపై వంతెనను కూటమి ప్రభుత్వం నిర్మించింది.

నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
Nellore News

నెల్లూరు, అక్టోబర్ 2: జిల్లాలోని పొట్టేపాళెం వద్ద 50 ఏళ్లుగా ఉన్న వంతెన సమస్య ఎట్టకేలకు తీరింది. దాదాపు రూ.6.54కోట్లతో కలుజుపై వంతెనను కూటమి ప్రభుత్వం నిర్మించింది. ఈరోజు(శుక్రవారం) ఈ వంతెనను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. దీంతో నాలుగు నియోజకవర్గాల ప్రజల కల నెరవేరింది. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక రెండు తుఫాన్లను ఎదుర్కొన్నామని తెలిపారు. ఆ సమయంలో కలుజు వద్ద ప్రయాణికుల ఇబ్బందులను చూశానన్నారు. వంతెన పనులను 11 నెలల్లోనే పూర్తి చేయడం ఓ చరిత్రగా చెప్పుకొచ్చారు. ఈరోజు బంగారు అక్షరాలతో చరిత్రలో లిఖించాల్సిన రోజన్నారు. కోటంరెడ్డి సోదరులు ఎంతో పట్టుదలతో వంతెన నిర్మాణానికి కృషి చేశారని కలెక్టర్ కొనియాడారు.


రెండేళ్లలోనే వంతెన పూర్తి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

రూరల్ నియోజకవర్గంలో రూ.966 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. చాలా వరకు పనులు పూర్తైనట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో వంతెన సమస్యపై అసెంబ్లీలో గళం విప్పానని అన్నారు. జగన్‌ను స్వయంగా తీసుకువచ్చి సమస్యని చూపించామని.. అయితే వంతెనను నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు.


పార్టీ ఆదేశిస్తే ఆ బరిలో నిలుస్తా: కోటంరెడ్డి కుమార్తె

వంతెన నిర్మాణం కోసం నాన్న ఎంతో శ్రమించారని కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వంతెన నిర్మాణంపై ప్రశ్నించిన వారిని ప్రారంభోత్సవానికి తీసుకువచ్చామన్నారు. ఇంత పెద్ద సమస్య తీరడం ఆనందమని హర్షం వ్యక్తం చేశారు. ‘పార్టీ ఆదేశించి, మా నాన్న నిర్ణయిస్తే... మేయర్, జెడ్పీ ఛైర్మన్ బరిలో నిలుస్తా’ అని సాయి వైష్ణవి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్

ఆటోను ఢీకొట్టిన అంబులెన్స్.. తెలంగాణ మహిళ మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 11:07 AM