ఎల్‌నినోపై రాజకీయాలు చేయకుండా అందరం కలిసి ఎదుర్కొందాం: మల్లు భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 28 , 2026 | 08:49 PM
ఎల్‌నినోపై రాజకీయాలు చేయకుండా అందరం కలిసి ఎదుర్కొందామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోపై రాజకీయాలు చేయకుండా అందరం కలిసి ఎదుర్కొందామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎల్. రమణ, వినోద్ కుమార్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఎం నుంచి జాన్‌వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం హాజరయ్యారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు: భట్టి విక్రమార్క
ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించామని వెల్లడించారు. అవసరమైతే అఖిలపక్ష నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్తామని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన సాయం కోరుతామని అన్నారు. కరువు నివారణకు అన్ని పార్టీలతో కలిసి సమష్టి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. పశువులకు తాగునీరు, మేత అందించేలా చర్యలు చేపడతామని అన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వల ఆధారంగా జలవనరులను నిర్వహిస్తామని చెప్పారు. అఖిలపక్ష నేతల సూచనలను ప్రభుత్వ కార్యాచరణలో పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. కరువు వేళ రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు సహకరించాలని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశంలో కృష్ణా, గోదావరి జలాలపై వాడి వేడి చర్చ..
ఈ సమావేశంలో తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అఖిలపక్ష సమావేశంలో కృష్ణా, గోదావరి జలాలపై వాడి వేడి చర్చ జరిగింది. కృష్ణ, గోదావరిలో నీరున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఎత్తిపోయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము ఎన్టీఎస్‌ఏ సూచనలు పాటించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నదీ జలాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రైతులు పంటలు వేయొద్దంటే పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యామ్నాయ పంటల కొనుగోలుకు హామీ ఇవ్వాలని సూచించారు. ధరలు పెరుగుతున్నందున రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రతిపక్షాల నేతలు కోరారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కోరేందుకు అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఇప్పుడే తీవ్ర నీటి కొరత ఎందుకు వచ్చిందని ఎంఐఎం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు పెట్టుబడులపై ఫోకస్.. గ్లోబల్ సమ్మిట్‌తో రేవంత్ సర్కార్ భారీ ప్లాన్!
హైదరాబాద్‌కు సింగూర్ జలాల తరలింపు ఆపకపోతే బరాబర్ అడ్డుకుంటాం.. రఘునందన్ వార్నింగ్
ఎల్‌నినో ప్రభావంతో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News