2 నెలలైనా 63శాతమే!
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:51 AM
స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. పలు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు కార్డులను తీసుకెళ్లేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నత్తనడకన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ
ఇప్పటివరకు 81.78 శాతం ఈ-కేవైసీ పూర్తి
పలు ప్రాంతాల్లో పట్టించుకోని లబ్ధిదారులు
హైదరాబాద్ సిటీ: జిల్లాలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. పలు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు కార్డులను తీసుకెళ్లేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చుచేసి ముద్రించిన కార్డులు కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను నవీకరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15నుంచి స్మార్టు కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేయడంతో పాటు క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు డీలర్‌కు కార్డు అందించిన తర్వాత ఈ-పాస్ యంత్రంపై దానిని స్కాన్ చేసిన వెంటనే వివరాలు ప్రత్యక్షమయ్యేలా దీనిని రూపొందించారు. ఇప్పటివరకు కార్డుపై తీసుకున్న బియ్యం, సరకులు, ప్రస్తుతం తీసుకోవాల్సిన వివరాలన్నీ కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
ఇప్పటివరకు 5,36,650 మందికే ..
జిల్లాలో 16 మండలాల పరిధిలో 653 రేషన్ దుకాణాలున్నాయి. మొత్తం 8,43,048మంది రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 5,36,650 (63 శాతం) మందికి మాత్రమే స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఆగస్టు 15న ప్రారంభించిన పంపిణీ రెండు నెలలైనా ఇంకా పూర్తి కాలేదు. మరో 3,06,3,98 (27శాతం) మంది ఇప్పటివరకు కార్డు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గోల్కొండ, బండ్లగూడ, బహదూర్‌పురా, చార్మినార్, ఆసిఫ్‌నగర్, నాంపల్లి మండలాల్లో లబ్ధిదారులు కార్డులను తీసుకెళ్లే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
స్థానిక పౌరసరఫరాలశాఖ కార్యాలయం నుంచి కార్డులను పట్టుకెళ్లాలని సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా సూచిస్తున్నప్పటికీ కొందరు పాతకార్డులతోనే సరుకులు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. బోగస్ కార్డులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా పౌరసరఫరాలశాఖ చేపట్టిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) కూడా ఇప్పటివరకు 100శాతం చేరుకోని పరిస్థితి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News