Share News

మారిటైమ్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌గా విశాఖ

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:48 AM

భారతీయ నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి చేరింది. దేశీయంగా నిర్మించిన తొలి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-1 (ఎఫ్‌ఎస్ఎస్‌-1) దిగ్విజయంగా జలప్రవేశం చేసింది.

మారిటైమ్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌గా విశాఖ

  • విశాఖలో స్వదేశీ తొలి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-1

  • ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

  • ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-5కు కీలు వేసిన కేంద్ర మంత్రి

  • స్లిప్‌వే-4, గోలియత్‌ క్రేన్‌ ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): భారతీయ నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి చేరింది. దేశీయంగా నిర్మించిన తొలి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-1 (ఎఫ్‌ఎస్ఎస్‌-1) దిగ్విజయంగా జలప్రవేశం చేసింది. ‘సూర్య’ అని నామకరణం చేసిన ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌)లో ప్రారంభించారు. దీనితోపాటు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌-5కు కీలు వేశారు. ఆధునీకరించిన స్లిప్‌వే-4ను, 300 టన్నులను ఎత్తగలిగే గోలియత్‌ క్రేన్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. సముద్రంపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలిగే మారిటైమ్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌గా విశాఖ ఎదగాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌-1 ప్రారంభం విజయానికి, ఎఫ్‌ఎస్ఎస్-5కు కీలు వేయడం సంకల్పాలని, కొత్త స్లిప్‌వే పెరుగుతున్న మన సామర్థ్యానికి ప్రతీకలని అభివర్ణించారు. నడి సముద్రంలో సుదీర్ఘంగా పనిచేసే యుద్ధ నౌకలకు ఇంధనాన్ని, లాజిస్టిక్స్‌ను సరఫరా చేసే, నిర్వహణకు సహకారం అందించే నౌకలు కూడా ముఖ్యమన్నారు. ఇటువంటి సహాయం అందించేవి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌లని చెప్పారు. హిందూ మహాసముద్రంలో నేవీ లక్ష్యాలను సాధించడంలోనూ, సుదీర్ఘంగా పని చేసే శక్తిని ఎఫ్‌ఎస్‌ఎస్‌-1 మ రింత బలోపేతం చేస్తుందన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా దేశ సముద్ర, రక్షణ అవసరాలకు హెచ్‌ఎ్‌సఎల్‌ సహకారం అందిస్తోందని చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌ది కీలకపాత్ర

దేశ మారిటైమ్‌ భవిష్యత్‌తో ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషించాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ఏపీ ఇండస్ట్రియల్‌ ఎకోసిస్టమ్‌తో హెచ్‌ఎస్‌ఎల్‌ మరింత అనుసంధానం కావాలన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎఈలు సరఫరాదారులుగా మారగలవని, నైపుణ్య అభివృద్ధితోపాటు పరిశోధనల్లో ఇక్కడి యూనివర్సిటీలు దోహదపడగలవని, డిజిటల్‌ షిప్‌ బిల్డింగ్‌కు టెక్నాలజీ కంపెనీలు మద్దతుగా నిలుస్తాయని, మారిటైమ్‌ టెక్నాలజీలను స్టార్టప్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తాయని చెప్పారు. హెచ్‌ఎస్ఎల్‌ చుట్టూ ఓ సంపూర్ణ నౌకా నిర్మాణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కావాలన్నారు. విశాఖపట్నం వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడి ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌, నేవల్‌ డాక్‌యార్డ్‌, హెచ్‌ఎస్‌ఎల్‌, విశాఖ పోర్టు ఉండటం మారిటైమ్‌ ఎకోసిస్టమ్‌ అనుసంధానానికి పునాది అన్నారు. నేవల్‌ నిపుణులు, నౌకానిర్మాణ సామర్థ్యం, ఇంజనీరింగ్‌ ప్రతిభ, పోర్టు మౌలికసదుపాయాలు, నైపుణ్యం గల మానవవనరులతో విశాఖపట్నాన్ని మేజర్‌ మారిటైమ్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌గా అభివృద్ధి చే యాలని పిలుపునిచ్చారు. మారిటైమ్‌ రంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభు త్వం ఎంతో సహకరిస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, షిప్‌ యార్డు సీఎండీ రఘురామ్‌, చీఫ్‌ ఆఫ్‌ నేవీ స్టాఫ్‌ కృష్ణ స్వామినాథన్‌, తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా తదితరులు పాల్గొన్నారు.


ఎఫ్‌ఎస్‌ఎస్‌లో స్వీయ రక్షణ వ్యవస్థ

ఎఫ్‌ఎస్‌ఎస్‌-1 సూర్య బరువు సుమారు 43,500 టన్నులు. భారత నౌకా దళానికి, సముద్రంలోని యుద్ధ నౌకలకు ఇది ఇంధనం, నీరు, ఆహారం, ఇతర సామగ్రిని అందించడంలో కీలక భూమిక పోషిస్తుంది. దీనివల్ల యుద్ధ నౌకలు సముద్రంలోనే ఎక్కువకాలం కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నౌకలో అధిక సామర్థ్యంలో సరకు, ద్రవ పదార్థాలను నిల్వ చేసే సదుపాయంతోపాటు వర్క్‌షాప్‌లు, హెలికాప్టర్‌ డెక్‌, స్వీయ రక్షణ వ్యవస్థ ఉంటాయి. ఈ నౌకను 18 నెలల్లోనే జల ప్రవేశం చేయించి హిందుస్థాన్‌ షిప్‌యార్డు సత్తా చాటింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 07 , 2026 | 06:48 AM