Share News

ఏపీపీఎస్సీ తప్పులకు మమ్మల్ని బలిచేయొద్దు!

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:56 AM

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల విషయంపై దాఖలైన అప్పీళ్లపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.

ఏపీపీఎస్సీ తప్పులకు మమ్మల్ని బలిచేయొద్దు!

  • మూల్యాంకనంలో లోపాల వల్ల ఫలానా అభ్యర్ధి లబ్ధి పొందినట్లు సిట్‌ నిర్ధారించలేదు

  • లోపాలతో ప్రక్రియను రద్దు చేయొద్దు

  • విజయవాడ మూల్యాంకనంతోనే మెరిట్‌ లిస్ట్‌

  • అవసరమైనప్పుడు జవాబుపత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించొచ్చు

  • ఎంపికైన అభ్యర్థుల వాదనలు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల విషయంపై దాఖలైన అప్పీళ్లపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల తరఫున సీనియర్‌ న్యాయవాది సురేంద్రరావు, న్యాయవాది శివ సంతోశ్‌ వాదనలు వినిపించారు. ‘‘మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు, లోపాల వల్ల ఫలానా అభ్యర్థి లబ్ధిపొంది ఉద్యోగం దక్కించుకున్నట్లు సిట్‌ నిర్ధారించలేదు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు పేర్కొంది తప్ప.. అక్రమాలు జరిగినట్లు తేల్చలేదు. జవాబుపత్రాల మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో పొరపాట్లు జరగడానికి ఏపీపీఎస్సీ అసమర్ధతే కారణం. ఏపీపీఎస్సీ చేసిన పొరపాట్లకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బాధితులుగా మారడానికి వీల్లేదు. విజయవాడలో జరిగిన మూల్యాంకనం ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను ప్రచురించారు. ఈ మూల్యాంకనం కోసం ప్రత్యేకంగా ఓఎంఆర్‌ వాల్యుయేషన్‌ స్లిప్పులు ముద్రించారు. ఈ నేపథ్యంలో అంతకుముందు ఓఎంఆర్‌ స్లిప్పులపై ఉన్న దిద్దుబాట్లు, ఓవర్‌ రైటింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం కోసం ఏర్పాట్ల ప్రక్రియ మాత్రమే జరిగింది. అంతిమంగా జవాబుపత్రాలను విజయవాడలోనే మూల్యాంకనం చేశారు. విజయవాడలో మూల్యాంకనం చేయించాలని చైర్మన్‌ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. బోర్డు తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని అభ్యర్థులు మాత్రమే కోరలేరు. అవసరమైనప్పుడు జవాబుపత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది. ఈ విషయంలో సింగిల్‌ జడ్జి పొరపాటు పడ్డారు. లోపాల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియను రద్దు చేయడానికి వీల్లేదు.’’ అని వాదించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల తరఫున న్యాయవాదుల అభ్యర్థన మేరకు సీనియర్‌ న్యాయవాదుల రిప్లై వాదనల కొనసాగింపు కోసం విచారణను కోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ డి. రమేశ్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


నోట్‌ ఫైల్‌ లేదు: ఏపీపీఎస్సీ

మంగళవారం జరిగిన విచారణలో.. గతంలో ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి సీహెచ్‌ సాయి ప్రకాశ్‌ అఫిడవిట్‌ వేసినట్లు ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది జీఎల్‌ మూర్తి కోర్టుకు నివేదించారు. మూల్యాంకనం చేసేందుకు జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌కు పంపే విషయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై నోట్‌ ఫైల్‌ లేదని తెలిపారు. అయితే, క్యామ్‌సైన్‌ సంస్థకు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌, హాయ్‌ల్యాండ్‌లో జవాబుపత్రాలకు భద్రత, ఏపీపీఎస్సీ నుంచి జవాబుపత్రాలను అక్కడికి రవాణా చేసే వాహనాలకు ఎస్కార్ట్‌ ఇవ్వాలని కోరుతూ అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి(ఎఫ్ఏసీ) పీఎస్ఆర్‌ ఆంజనేయులు గుంటూరు ఎస్పీకి రాసిన లేఖలు ఉన్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియ రద్దు నిర్ణయానికి సంబంధించి కమిషన్‌ వద్ద ఎలాంటి రికార్డులు లేవని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:56 AM