‘15 రోజుల్లో కారుణ్య నియామకాలు’.. సింగరేణి కార్మికులకు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:45 PM
సింగరేణిలో 38,738 మంది పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 29,715 మంది పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారి సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు, కార్మికులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో 38,738 మంది పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 29,715 మంది పని చేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను 15 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. మారుపేర్ల అంశానికి సంబంధించి 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోందని.. ఇకపై సింగరేణిలో ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
కరోనా సమయంలో విధులకు హాజరుకాకుండా డిస్మిస్ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. వన్ టైమ్ ఆప్షన్ కింద వారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. సింగరేణికి చెందిన 1250 ఎకరాల్లో జీవో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఆక్రమణలో ఉన్న వారిలో అర్హులకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హౌసింగ్ కాలనీ నిర్మించి కార్మికులకు అందిస్తామని.. కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని చెప్పారు. నెహ్రూ హౌసింగ్ కాలనీ పేరిట ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
ఏరియా హాస్పిటల్స్‌ను కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్నికల్లో గెలవలేక రాజ్యంగ సంస్థలపై దండయాత్ర.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
రాహుల్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్
Read Latest Telangana News And Telugu News