మొయినాబాద్ డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:48 PM
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి.
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు (Moinabad Farm House Drug Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో జరిగిన పరిణామాలు, డ్రగ్స్ వినియోగం, రక్త పరీక్షల ఫలితాలు, పార్టీలో పాల్గొన్నవారి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్‌తో పాటు మద్యం పార్టీ జరిగినట్లు పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్నవారు లిక్కర్‌తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు.
డ్రగ్స్ పార్టీకి ముందుగానే ప్లాన్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్‌తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. మరోసారి ఎర్రగడ్డ ఆస్పత్రిలో అందరికీ రక్తనమునాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడిందని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వచ్చిందని వెల్లడించారు. ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్‌రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. ఈ పార్టీలో మద్యం, కొకైన్ కలుపుకొని తాగారని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికి వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంకా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను ప్రస్తావించారు.
మేము వారించినా కాల్పులు జరిపారు: పోలీసులు
ఫామ్‌హౌస్‌లోకి వెళ్లగానే మొదటగా తుపాకీ శబ్ధాలు వినపడ్డాయని పోలీసులు తెలిపారు. ‘తుపాకీ కాల్పుల శబ్ధాలు విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం. కాల్పులు జరపొద్దని, ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా చెప్పాం. మేము చెప్పిన్నప్పటికీ కూడా మరో రెండు సార్లు తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించాయి. మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటాను.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ ఫాంహౌస్ నుంచి మాకు గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా వారించేసరికి ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధాలు నిలిచిపోయాయి. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్‌హౌస్‌లో రైడ్స్ చేసేందుకు అప్పటికే మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించగానే వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాం. బాత్ రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని మేము స్వాధీనం చేసుకున్నాం. బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరు ఉన్నారని, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లో ఓ మహిళతో పాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మనీకి చెందిన రివాల్వర్ - 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని వేర్వేరుగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. అందరిని పదేపదే విచారించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు. అతన్ని పరిశీలించినప్పుడు రెండు గ్రాముల కొకైన్ బయటపడింది’ అని పోలీసులు వెల్లడించారు.
సిమ్లా నుంచి డ్రగ్స్..
కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని వారిని ముందుగా అడిగితే చెప్పలేదని పోలీసులు తెలిపారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్‌ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడిందని అన్నారు. ‘ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బును కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నారు. కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నారు. సిమ్లా బిజినెస్ ట్రిప్‌నకు వెళ్లినప్పుడు తాను కొకైన్ తీసుకువచ్చానని చెప్పారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొన్నట్లుగా తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్‌ను తీసుకువచ్చినట్లు కౌశిక్ చెప్పారు. డ్రగ్స్ ఒక్కొక్క గ్రామ్‌కి రూ.15000లు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పారు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్స్ ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్‌రెడ్డిలకు డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చింది. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్ట్ చేశాం. ఈ కాల్పులు జరిపిన తుపాకీని పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. లైసెన్సు రివాల్వర్ నితీశ్‌రెడ్డి వద్ద ఉండాల్సిందని.. కానీ నమిత్ శర్మ వద్దకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిగినట్లు నమిత్ శర్మ చెప్పారు. ఫామ్‌హౌస్‌లోకి వస్తున్న పోలీసులను భయభ్రాంతులకు గురిచేయడానికే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్‌హౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని వారు ప్లాన్ చేశారు. తుపాకీతో కాల్పులు చేసి పోలీసులను తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారు’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News