అసెంబ్లీలో న్యాయం జరగట్లేదు.. అందుకే ఢిల్లీలో ఫిర్యాదు చేశాం: ఎమ్మెల్యే సబిత
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:53 PM
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అసెంబ్లీ గేటు వద్ద రసాభాస జరిగింది. ఈ సంఘటన కౌరవసభను తలపిస్తోంది. మహిళా ఎమ్మెల్యేల జుట్టుపట్టుకుని లాగారు. పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కేశారు. పోలీసుల గొడవల్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కింద పడిపోయారు. 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న మమ్మల్ని అసెంబ్లీ లోపలికి ఎందుకు అనుమతించలేదు. కనీసం మహిళా ఎమ్మెల్యేలనైనా అనుమతించమని అడిగితే పోలీసులు వినిపించుకోలేదు. ముఖ్యమంత్రే మాపై దాడికి ఆదేశాలు జారీచేశారని నేను నమ్ముతున్నానను’ అని సబిత పేర్కొ్న్నారు.
‘అసెంబ్లీ సమావేశంలో అయినా మాపై జరిగిన దాడి గురించి చర్చ జరుపుతారనుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి, డీజీపీ ఈ సంఘటన గురించి మాట్లాడుతారని అనుకున్నాం. కానీ ఎవరూ నోరు మెదపలేదు. మాపై దాడిచేసి, మాపైనే కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేశారు. స్పీకర్‌ను మా ఎమ్మెల్సీ ఏమో అన్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి చావుడప్పు కొట్టమని మనుషుల్ని పంపారు. ఇవన్నీ సీఎం డైరెక్షన్‌లోనే నడిచాయి. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడులకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. మాకు జరిగిన అవమానాన్ని సభలో చెప్పుకునేందుకూ అవకాశమివ్వలేదు. మాకు అసెంబ్లీలో న్యాయం జరగలేదు.. అందుకే ఢిల్లీకి వచ్చాం. ఇది ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన విషయం’ అని సబిత మండిపడ్డారు.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సబిత అన్నారు. ఇంతవరకూ హామీలను నెరవేర్చలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 22ఏ కింద కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి కాంగ్రెస్ భూదందాకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ సాక్షిగా దాడులు చేశారని ధ్వజమెత్తారు. మహిళా కానిస్టేబుళ్లను ముందుపెట్టి శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్తామని, వారికి లేఖలు కూడా రాస్తున్నామని ఎమ్మెల్యే సబిత తెలిపారు.
ఇవీ చదవండి:
ఇందిరమ్మ రాజ్యం.. భూరాక్షసుల స్వర్ణయుగం: కేటీఆర్
కోతులతో పరేషాన్.. ఇళ్లలోకి చొరబడుతూ ఇబ్బందులు