ఈటల రాజేందర్ ఫ్లెక్సీల వివాదం.. రామచందర్ రావు ఏమన్నారంటే...
ABN , Publish Date - May 31 , 2026 | 06:52 PM
బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ని విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ని (Etela Rajender) విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
ముక్తకంఠంతో ఖండించిన నేతలు..
ఈటల రాజేందర్‌ను కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, డా. పాల్వాయి హరీశ్ బాబు, పవార్ రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఎమ్మెల్సీలు ఏవీ ఎన్ రెడ్డి, డా. సి. అంజిరెడ్డి, మల్కా కొమురయ్య తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి భయపడుతున్న వారే ఇలా చేశారని మండిపడ్డారు.
దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈటల రాజేందర్ ప్రజాజీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిని అవమానించేందుకు ప్రయత్నించడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అధికార పార్టీతో పాటు ఇతర ప్రత్యర్థి రాజకీయ శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉందని, ఇలాంటి కుట్రలు పార్టీ ఐక్యతను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలను తిరస్కరిస్తారని బీజేపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ
సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News