కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ
ABN , Publish Date - May 31 , 2026 | 05:19 PM
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కామారెడ్డి జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదాలపై కమిటీ దృష్టి సారించింది.
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఈరోజు (ఆదివారం) గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కామారెడ్డి జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదాలపై కమిటీ దృష్టి సారించింది.
పాలకుర్తిలో కాంగ్రెస్ అంతర్గత పోరు..
పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. హరి ప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్‌లపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ యశస్వినీ రెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు హరి ప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్ వర్గం కూడా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ రెండు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న యశస్వినీ రెడ్డి, ఇవాళ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు.
కామారెడ్డి నేతల వివాదం..
అదే సమయంలో కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదం కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై.. షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. షబ్బీర్ అలీని ఉద్దేశించి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని షబ్బీర్ అలీ వర్గం ఆరోపించింది. అలాగే సొంత పార్టీ నాయకులకు బదులుగా ఇతర పార్టీల నేతలకు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కూడా షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది.
కమిటీ నిర్ణయంపై ఆసక్తి
పాలకుర్తి, కామారెడ్డి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం కావడంతో క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కమిటీ తగిన చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.