సీఎం ఇంట్లో ఎసీ కూడా పనిచేయదు: ఎంపీ రఘునందన్ రావు
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:54 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవడం ఆపేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వాన్ని విమర్శించారు.
మెదక్ జిల్లా, అక్టోబర్ 24: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవడం ఆపేసి గ్రామాల్లో సోలార్ పానెళ్లను ఏర్పాటు చేస్తే.. కనీసం వచ్చే సంవత్సరం అయినా కరెంట్ కోతలు ఉండవని.. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సెక్రటేరియట్లో సీఎం లిఫ్ట్, ఇంట్లో ఏసీ కూడా పనిచేయని పరిస్థితి వస్తోందని ఎంపీ రఘునందన రావు హెచ్చరించారు.
‘కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని.. ఒకదానిపై మరోటి విమర్శలు చేసుకుంటాయి తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన వాటికి లేదు. కరెంటు ఇవ్వడం లేదు. సూర్యుడు ఉచితంగా కరెంటును ఇస్తున్నాడు కదా.. ప్రతి ఇంటి మీద రెండు కిలోవాట్ల సోలార్ పెట్టమని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్పడం లేదు. 50% ఇళ్ల మీద సోలార్ అమర్చితేనే.. పంచాయతీ నిధులు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు. ప్రతి ఇంటికి రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ అమరికపై కేంద్రప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది కదా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవట్లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు కాలువలు కట్టలేదు. గత ముఖ్యమంత్రికి ఆ కాంట్రాక్టర్ దోస్తు. ఈ ముఖ్యమంత్రికి కూడా ఆ కాంట్రాక్టర్ దోస్తే. మరి అందరు దోస్తులయితే దుబ్బాక కాలువలు ఎవరు తవ్వుతారు’ అని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క