ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ నివాసానికి పోలీసులు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:43 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ని సిట్ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకుని, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పోలీసులు ఇంటి పరిసరాలను తనిఖీలు చేసినట్లు సమాచారం..
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును (KCR)ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శుక్రవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకుని, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పోలీసులు ఇంటి పరిసరాలను తనిఖీలు చేసినట్లు సమాచారం.
పోలీసుల పహారా..
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక ఘట్టం ఆరంభమైంది. కేసీఆర్‌ని విచారించేందుకు సిట్ (SIT) అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు గురువారం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో తన వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేశారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసంలోని సిబ్బందికి నోటీసులు అందజేశారు. రేపటి విచారణ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కేసీఆర్ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మీడియా, కార్యకర్తల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో బందోబస్తుపై పోలీసులు ఆరా తీశారు.
సిట్ నిబంధనలు..
సిట్ అధికారులు కేసీఆర్‌కి సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఇందులో కొన్ని ముఖ్యమైన వెసులుబాట్లు కల్పించారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు సిట్ విచారణ ప్రారంభం కానుంది.
వయోపరిమితి వెసులుబాటు..
కేసీఆర్ వయస్సు 65 ఏళ్లు దాటినందున, ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్ స్పష్టం చేసింది. ఆయన తన నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. ఒకవేళ ఆయన ఇష్టపడితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో చోటును కూడా సూచించవచ్చని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
సిట్ ఫోకస్..
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్‌రావులను ఇప్పటికే సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నుంచి ప్రధానంగా ఈ క్రింది అంశాలపై సమాధానాలు రాబట్టాలని భావిస్తోంది..
ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి?
ఇంటెలిజెన్స్ అధికారులకు నేరుగా ఆదేశాలు వెళ్లాయా?
ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయ అవసరాలకు ఎలా వాడుకున్నారు?
పై అంశాలపై సిట్ విచారణ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
Read Latest Telangana News And Telugu News