కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టరట్టు
ABN , Publish Date - Mar 01 , 2026 | 09:20 AM
శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడులు జల్‌పల్లిలోని ఎస్కే రాయల్ ఎంటర్‌ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై నిర్వహించారు.
హైదరాబాద్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అక్రమ తయారీ కేంద్రం బట్టబయలైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కంపెనీలు FSSAI అనుమతులు లేకుండా అక్రమంగా కల్తీ పేస్ట్ తయారీ చేస్తున్నారు. ఉత్పత్తిలో సింథటిక్ రంగులు, తక్కువ నాణ్యత గల పదార్థాలు ఉపయోగించి, అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు రూ.10 లక్షల విలువైన అల్లం, వెల్లుల్లి, ఇతర మిశ్రమాలు, ముడిసరుకు ఉన్నాయి. మొత్తం 340 కిలోలకు పైగా అల్లం - వెల్లుల్లి పేస్ట్, 12 భారీ టబ్బులు, 20 బ్యాగుల వెల్లుల్లి, 5 బ్యాగుల ఉప్పు, ఫుడ్ కలర్స్, సిట్రిక్ యాసిడ్ పౌడర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు గ్రైండింగ్, మిక్సింగ్ మెషిన్లు, ప్యాకింగ్ సామగ్రి కూడా సీజ్ చేశారు. ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో 318(4), 275, 223 r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల ద్వారా ఆహార ప్రమాణాల ఉల్లంఘనలను నియంత్రించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, ఈ సరఫరా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్ గురించి విచారణ జరుపుతున్నారు. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై FSSAI మార్క్ లేనివి కొనద్దని సూచించారు. అతి తక్కువ ధరకు వచ్చే విడి అల్లం - వెల్లుల్లి పేస్ట్‌లను కొనుగోలు చేయొద్దని, ఆహార భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And Telugu News