బొల్లారం చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. డబ్బు కోసం సెక్యూరిటీ గార్డే..
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:07 PM
హైదరాబాద్‌లోని బొల్లారంలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గేటెడ్ కమ్యూనిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డే డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: భాగ్యనగరం బొల్లారం పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసును మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. గేటెడ్ కమ్యూనిటీలో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజ్‌గిరి సీపీ సుమతి మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘బొల్లారం పరిధిలోని సీడ్ వర్క్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న మిల్టన్ ఫెర్నాండెజ్ మోసెస్ ఐదేళ్ల కుమార్తె ఆరేలియా.. అక్టోబర్ 10న సాయంత్రం వేళ కిడ్నాప్‌కు గురైంది. అదే రోజు రాత్రి 7:45 గంటల సమయంలో రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్.. చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా.. మల్కాజ్‌గిరి, ఎస్ఓటి, క్రైమ్స్, స్పెషల్ బ్రాంచ్‌లతో కూడిన పది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాం. అయినా ఫలితం లేకపోయింది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేశాం. 4 గంటల్లో 130 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. ఎక్కడా చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో.. గేటెడ్ కమ్యూనిటీ అంతా గాలించగా సెల్లార్‌లోని నీటితొట్టెలో చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ మేరకు అనుమానం వచ్చి సెక్యూరిటీ గార్డులను విచారణ చేయగా.. అసలు నిజం బయటపడింది.
కమ్యూనిటీలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ కుమార్ డబ్బు కోసం పాపను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. అయితే.. చిన్నారి తల్లిదండ్రులు రూ.25 లక్షలు ఇచ్చేంతవరకు చిన్నారిని తన వద్ద అట్టిపెట్టుకోవడం కష్టమని భావించి.. చిన్నారి కాళ్లుచేతులు కట్టేసి సెల్లార్‌లోని నీటితొట్టెలో పడేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడికి శిక్ష విధించేలా విచారణ కొనసాగిస్తున్నాం’ అని సీపీ సుమతి చెప్పారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గేటెడ్ కమ్యూనిటీల్లో సెక్యూరిటీ సిబ్బంది నేపథ్యాన్ని తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్, పని మనుషుల వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష
‘ఫసల్ బీమా అమలు చేయాల్సిందే’.. రేవంత్ సర్కార్‌కు రాంచందర్ హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News