Share News

‘ఫసల్ బీమా అమలు చేయాల్సిందే’.. రేవంత్ సర్కార్‌కు రాంచందర్ హెచ్చరిక

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:18 PM

2014కు ముందు దేశంలో అనేక కుంభకోణాలు చూశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారని తెలిపారు.

‘ఫసల్ బీమా అమలు చేయాల్సిందే’.. రేవంత్ సర్కార్‌కు రాంచందర్ హెచ్చరిక
Ramchander Rao

హైదరాబాద్, అక్టోబర్ 12: 2014కు ముందు దేశంలో అనేక కుంభకోణాలు చూశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారని తెలిపారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, రైల్వే, ఎయిర్ వేస్‌ను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణకు 12 ఏళ్లలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని చెప్పారు. 41 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నా అని.. ఓట్ డిలీట్ అయిన వాళ్లలో పది మందిని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి తీసుకురావాలన్నారు.


ఒసామా బిన్ లాడెన్ వారసులు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ రాంచందర్ రావు విరుచుకుపడ్డారు. దేవుళ్లను ఎగతాళి చేయొద్దని.. హిందువులు ఆగ్రహంతో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేసే పిచ్చి తుగ్లక్ పనులకు పోతారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు, రైతుల మీద ఉన్న ప్రేమ ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.


కాక్రోచ్.. పిక్రోచ్ కలిసి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని తెలంగాణకు రానివ్వమన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు రాహుల్‌ను అడ్డుకుంటామని తెలిపారు. గోవాలో కాదు తెలంగాణలో డ్రగ్స్ పెరిగిపోతోందని.. నషా ముక్త్‌ భారత్ అనేది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పుకొచ్చారు. జ్ఞానేష్ కుమార్‌తో బీజేపీకి ఏం సంబంధమని నిలదీశారు. నిరసనకారులపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఎక్కడా గెలవదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కొత్తగా లాంచ్ చేయాలని చూస్తున్నారు కానీ ల్యాండ్ కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. కేబినెట్ రద్దు చేసి మరీ.. స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని సీఎం సహా మంత్రులపై రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఇవి కూడా చదవండి...

ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 02:32 PM